మధ్యలో ఉద్యోగులు నలిగిపోతున్నారా ?

Update: 2021-02-07 03:30 GMT
‘విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం’ అన్న సామెతలాగ అయిపోయింది ప్రభుత్వం యంత్రాంగం పరిస్దితి. తాను చెప్పినట్లు వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగులను పదే పదే హెచ్చరిస్తున్నారు. హెచ్చరికలు జారీ చేయటమే కాకుండా కొందరిపై యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. దాంతో ఉద్యోగులంతా పంచాయితి ఎన్నికల్లో ఒక విధమైన టెన్షన్ వాతావరణంలో పనిచేస్తున్నారు.

సీన్ కట్ చేస్తే శుక్రవారం మీడియా సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిమ్మగడ్డ చెప్పినట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇఛ్చారు. ఇంతకీ మంత్రి కోపానికి కారణం ఏమిటంటే ఏకగ్రీవమైన పంచాయితీలను అధికారులు ప్రకటించలేదట. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ పంచాయితీల్లో ఏకగ్రీవాలైన విషయం అందరికీ తెలిసిందే.

ఎప్పుడైతే ఎక్కువ పంచాయితీల్లో ఏకగ్రీవాలయ్యాయో వెంటనే వాటి ఫలితాలను నిలిపేయాలని నిమ్మగడ్డ సంబంధిత అధికారులను ఆదేశించారు. దాంతో ఏకగ్రీవ ఫలితాలను అధికారులు ప్రకటించకుండా నిలిపేశారు. అంటే ఏకగ్రీవాలైన పంచాయితీలను ప్రకటిస్తే నిమ్మగడ్డకు కోపం, ప్రకటించకుండా ఆపేస్తే మంత్రికి కోపం. దీంతో తాము ఏమి చేయాలో అర్ధంకాక ఉద్యోగులకు దిక్కుతోచటం లేదు. మంత్రికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ఎన్నికల విధుల్లో ఉన్న యంత్రాంగం అంతా నిమ్మగడ్డ చెప్పినట్లు వినాల్సిందే.

నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను గుడ్డిగా అమలు చేసే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మార్చి 31వ తేదీ వరకు తాము ఏమీ మాట్లాడమని తర్వాత నుండి అధికారులపై యాక్షన్ ఉంటుందని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేయటంలో అర్ధంలేదు. కాబట్టి నిమ్మగడ్డపై మాట్లాడేటపుడు మంత్రులు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. నిమ్మగడ్డ ఆదేశాలను గుడ్డిగా పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనంటే ఏమనర్ధం ?

ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ హోదాలో నిమ్మగడ్డకు రాజ్యాంగబద్దమైన రక్షణ ఉంది. ఆ రక్షణను చూసుకుని నిమ్మగడ్డ ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే భావన వైసీపీలో ఉంది. కాబట్టి ఎవరు ఏమి చేయగలిగేదేమీ లేదు. నిమ్మగడ్డ విషయంలో ఏ విధంగా వ్యవహించాలనేది ప్రభుత్వ ఇష్టం. ఇంతోటిదానికి నిమ్మగడ్డ మీద కోపాన్ని అధికారుల మీద చూపుతామని మంత్రి హెచ్చరించటం తప్పు. లేకపోతే యంత్రాంగం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే ప్రమాదముంది.


Tags:    

Similar News