ప‌ద‌వుల‌న్నీ హుజూరాబాద్ నేత‌ల‌కే

Update: 2021-08-22 10:16 GMT
హుజూరాబాద్ లో గెలిచి తీరాల‌న్న టీఆర్ఎస్ క‌సి.. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు ప‌ద‌వుల పండగ‌ను తెచ్చింద‌నే చెప్పాలి. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా ప‌ది మందికి పైగా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు కొత్త‌గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ ప‌దవులు ద‌క్క‌నున్నట్లుగా వినిపిస్తున్న వార్త‌లు.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌ను తీవ్ర మ‌న‌స్తాపానికి గురి చేస్తున్నాయ‌ట‌. ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై పార్టీలోని సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

త‌న‌ను ధిక్క‌రించే దిశ‌గా వెళుతున్న ఈట‌ల రాజేంద‌ర్ ను కేసీఆర్ ఏకంగా త‌న కేబినెట్ నుంచే బ‌హిష్క‌రించినంత ప‌నిచేశారు. దీనిని అవ‌మానంగా భావించిన ఈట‌ల‌.. కేసీఆర్ కు త‌న స‌త్తా ఏమిటో తెలియజేయాల‌న్న దిశ‌గా టీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ నుంచి అందిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేసి.. నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. వెర‌సి హుజూరాబాద్ కు ఉప ఎన్నిక‌ను అనివార్యం చేశారు. ఈ ఎన్నిక‌లో గెలిచి కేసీఆర్ కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని ఈట‌ల వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈట‌ల వ్యూహం ఏమిటో అర్థ‌మైన కేసీఆర్.. హుజూరాబాద్ బ‌రిలో టీఆర్ఎస్ కు విజ‌యం ద‌క్కి తీరాల‌న్న దిశ‌గా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ సాగుతున్నారు. ఇప్ప‌టికే దళిత బంధును ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. ఇప్పుడు కొత్త‌గా హుజూరాబాద్ కు చెందిన వివిధ వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇలా ఉప ఎన్నిక పుణ్య‌మా అని ప‌ద‌వులు దక్కే నేత‌ల జాబితా పెద్ద‌గానే ఉంద‌ట‌. ఈటలకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న బండ శ్రీనివాస్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని అప్పగించేసి ఆయ‌న‌ను ఈట‌ల‌కు దూరం చేసేశారు. ఈటల సామాజికవర్గానికే చెందిన పింగిలి రమేశ్ కు ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వనున్నార‌ట‌. ర‌మేశ్ కు ప‌ద‌వితో ఈట‌ల‌కు ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గాన్ని దూరం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ట‌. జమ్మికుంట మాజీ సర్పంచ్‌, ప్రస్తుత కౌన్సిలర్‌, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన పొనగంటి మల్లయ్యకు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే దిశ‌గా మంత‌నాలు సాగుతున్నాయ‌ట‌. ఇక టీఆర్ఎస్‌ టికెట్‌ ఆశించిన బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని క‌ట్ట‌బెడ‌తార‌ట‌. మాజీ మండల పరిషత్‌ అధ్యక్షుడు చుక్క రంజిత్ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి ప‌ద‌వినే కోరుతున్నార‌ట‌. మొత్తంగా ఉప ఎన్నిక హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు ప‌ద‌వుల పండ‌గ‌ను తెచ్చింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News