చినబాబు కోసం అన్ని కోట్ల ఖర్చా.?

Update: 2019-05-18 04:59 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. 200 కోట్ల ఖర్చు.. కేవలం ఒక్క నియోజకవర్గంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు తన తనయుడిని తొలిసారి బరిలోకి దింపి పోటీచేయించిన   మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల్లో గెలుపు కోసం పెట్టిన ఖర్చు లెక్క ఇదీ అట... ఇక్కడ ప్రత్యర్థి అలాంటి ఇలాంటి వారు కాదు.. ఏకంగా హైకోర్టులో చంద్రబాబును కేసులతో చెడుగుడు ఆడించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి.. గట్టి ప్రత్యర్థి.. పైగా తొలిసారి లోకేష్ బాబు బరిలోకి దిగుతున్నాడు. అందుకే మంగళగిరిలో డబ్బు ఏరులై పారైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు గెలుపు కోసం చేతికి ఎముకే లేకుండా ఖర్చు చేశాడని గుసగుసలు వినిపించాయి.. అధికారులతో మిలాఖత్ అయ్యి ఎన్నో అడ్డదారులు టీడీపీ తొక్కొందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కాబోయే ముఖ్యమంత్రి, భావి టీడీపీ అధ్యక్షులు.. పైగా రాజకీయ వారసుడి తొలి ఎంట్రీ. అందుకే ఎవ్వరూ ఓడినా.. కానీ లోకేష్ బాబు మాత్రం గెలవాలనే పట్టుదలతో టీడీపీ నేతలంతా మంగళగిరిలో మోహరించారు.. లోకేష్ ను గెలిపించడానికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారని తాజాగా మంగళగిరి నుంచి వైసీపీ తరుఫున పోటీచేసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విచిత్రం ఏంటంటే డబ్బే కాదు.. ఓట్లు పడడానికి కుటుంబాలకు కుటుంబాలే గిఫ్ట్ లు పంచిపెట్టారట.. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్లు ఇలా ఇష్టం వచ్చిన బహుమతులుగా ఓట్ల కోసం పంచిపెట్టారట.. లోకేష్ బాబు గెలుపు కోసం ఇంతలా దిగజారి అవినీతికి పాల్పడ్డారని వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపిస్తున్నారు.

అయితే లోకేష్ బాబు గెలుపు కోసం ఖర్చు పెట్టిన ఆ 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆళ్ల రామకృష్ణరెడ్డి ధీమాగా ఉన్నారు. లోకేష్ బాబు పంచిన డబ్బులను ఓ ముసలావిడ తీసుకొచ్చి తన చేతిలో పెట్టిందని.. స్వచ్ఛందంగా తనకే ఓట్లు వేశామని చెప్పారని.. దీన్ని బట్టి మంగళగిరిలో గెలుపు తనదేనని ఆళ్ల రామకృష్ణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మంగళగిరిలో లోకేష్ పంచిన 200 కోట్ల డబ్బు ఆయనను గెలిపిస్తుందా.? స్థానికుడు.. ప్రజల కోసం పాటుపడే ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిస్తాడా అన్నది మే 23న తేలనుంది. కోట్లకు, ప్రజాభిమానానికి జరిగిన మంగళగిరి పోరులో గెలుపెవరిది అనేది ఉత్కంఠగా మారింది.

    
    
    

Tags:    

Similar News