ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా..లింగ‌మ‌నేనికి ఎమ్మెల్యే ఆళ్ల స‌వాల్‌

Update: 2019-09-25 12:40 GMT
మాజీ సీఎం చంద్ర‌బాబు ఉంటున్న నివాసానికి సంబంధించిన వివాదం ముదిరి పాకాన ప‌డుతోంది. కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న లింగ‌మ‌నేని ర‌మేష్‌ కు చెందిన ఎస్టేట్‌ లో 2015 నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసం ఉంటున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌పాటు బాబు హ‌యాం ఎలా ? ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోయి వైసీపీ అధికారంలోకిరావ‌డంతో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. అక్ర‌మ నివాసాలు - ముఖ్యంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని క‌ట్ట‌డాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నివాసాన్ని అక్ర‌మంగా నిర్మించార‌ని ఆరోపిస్తూ.. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోర్టుకు ఎక్కారు.

అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి కూడా ఆయ‌న ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ నివాసానికి ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన ప్ర‌భుత్వం తుది గ‌డువు కూడా విధించింది. అయితే, తాను ఈ నిర్మాణాన్ని నిబంధ‌న‌ల మేర‌కే నిర్మించాన‌ని - అప్ప‌టి పంచాయ‌తీకి అన్ని అనుమ‌తుల కోసం అప్ల‌యి చేశాన‌ని - దీంతో వారి నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే.. నిర్మాణం ముందుకు సాగింద‌ని.. ఈ విష‌యంలో ఎలాంటి అక్ర‌మాలు లేవ‌ని తాజాగా లింగ‌మ‌నేని ర‌మేష్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు అవ‌సరమే కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వానికి - ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే దృక్ఫ‌థంతోనే తాను ఈ ఇంటిని ఇచ్చాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా బుధ‌వారం స్పందించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. ర‌మేష్ బాగోతం ఇదీ అంటూ.. ప‌త్రాలు - సాక్ష్యాలు సహా అన్నీ బ‌య‌ట‌కు తీశారు. పంచాయ‌తీ నుంచి ఎలాంటి అనుమ‌తులు పొంద‌లేద‌ని - అయినా ఉడా ప‌రిధిలోకి ఉన్న ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇక‌, గ‌తంలో చంద్ర‌బాబు ఈ విష‌యంపై స్పందించిన‌ప్పుడు.. దీనిని పూలింగ్‌ లో తీసుకున్నామ‌ని - ఇది ప్ర‌భుత్వ భ‌వ‌న‌మేన‌ని చెప్పార‌ని - ఒక‌వేళ ర‌మేష్ ఇవ్వ‌క‌పోయినా.. దీనిని సేక‌ర‌ణ‌లో భాగంగా తీసుకునే వార‌మ‌ని 2015లో ఆయ‌న చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆళ్ల గుర్తు చేశారు.

ఈ విష‌యంపై చంద్ర‌బాబు మ‌రోసారి క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇది ప్ర‌భుత్వ భ‌వ‌న‌మే అయితే.. చంద్ర‌బాబు ఖాళీ చేయాల‌ని అన్నారు. ఈ విష‌యంలో చ‌ర్చ‌ల‌కు తాను ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తాన‌ని ర‌మేష్‌కు స‌వాల్ విసిరారు. మ‌రి దీనికి టీడీపీ కానీ - ర‌మేష్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News