అమ‌రావ‌తి ఏపీ 14వ జిల్లా

Update: 2015-07-20 09:32 GMT
ఏపీ నూతన రాజధాని అమరావతి ఓ కొత్త జిల్లాగా ఆవిర్భవించబోతుందా? నూతన రాజధాని ప్రాంతాన్ని ప్ర్యత్యేక జిల్లాగా మార్చబోతున్నారా? ఆ దిశగా ప్రభుత్వం అడుగుల వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కృష్ణా , గుంటూరు జిల్లాలోని దాదాపు 59 మండలాలను కలిపి రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..దానికి సంబంధించి కసరత్తులు కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.

ఏపీ నూతన రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఏపీ రాజధాని నిర్మిస్తామని మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అందుకోసం కృష్ణా , గుంటూరు ప్రాంతాల్లోని చాలా భాగాన్నిరాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పేరుతో పరిధులు నిర్ణియించింది. గతంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను కలిపి ఒక అథారిటీ ఉండేది. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత పాత అథారిటీని తొలగించి, దాని స్థానంలో  సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం సీఆర్‌డీఏ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఓ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేపట్టి అమరావతి కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు తొలిదశలో రాజధాని పరిధిలోని తొమ్మిది శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తుంది. కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, రిజిష్ట్రేషన్, నైపుణ్య కార్పోరేషన్, మెప్మా, పోలీస్ శాఖ, లీడ్ బ్యాంక్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నుంచి గతంలో ఉత్తర్వులను జారీ అయ్యాయి. రాజధాని నిర్మాణంలో ఈ శాఖలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ శాఖలకు సంబంధించిన అధికారులను, సిబ్బందిని సత్వరమే నియమించాలని నిర్ణయించారు. వీరంతా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధీనంలో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 59 మండలాలు, రెండు కార్పోరేషన్లు, 10 మున్సిపాలిటీలు కలిపి అమరావతి జిల్లా అమరావతి కేంద్రంగా జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటు పై సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ ఆలోచన కార్య‌రూపం దాల్చిన త‌ర్వాత అమ‌రావ‌తి 14వ జిల్లాల రూపుదిద్దుకునే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News