కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి ..రాష్ట్రపతి కి రైతుల విన్నపం!

Update: 2020-01-02 06:27 GMT
గత కొన్ని రోజులుగా అమరావతి ప్రాంత రైతులు , ప్రజలు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అయితే , అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని , దీనితో రాష్ట్రం అంతా అభివృద్ధి లోకి వస్తుంది అని చెప్పి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెల్లడించారు. కానీ , దీనికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రభుత్వం సర్ది చెప్పాలని చెప్పినప్పటికీ కూడా రైతులు వెనక్కి తగ్గడంలేదు. దీనికి తోడు టీడీపీ, జనసేన నేతలు కూడా రైతులకి మద్దతు అంటూ వారి నిరసనలతో పాల్గొనడంతో ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుంది.

ఇకపోతే గత రెండు వారాలుగా ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందనని తెలియజేయకపోవడంపై ఆగ్రహం చెందిన రైతులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో మోసపోయిన తమకు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖలు రాసారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారని వారు తమ లేఖల్లో వాపోయారు. ఇప్పటికే తమ ఆందోళనను స్వయంగా కలిసి రాష్ట్రపతికి వివరించిన రైతులు..ఇప్పుడు లేఖల ద్వారా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరటం సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఏపీ రాజధానుల వ్యవహారం పైన చర్చ సాగుతోంది. తాజాగా రైతుల ఈ లేఖలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అర్థరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి అరెస్టులు చేస్తున్నారని, అండగా నిలవాల్సిన ప్రభుత్వ మే మాపై కక్ష కట్టిందని, రాజధాని పొతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని.. మరణమే శరణ్యమంటూ రాష్ట్రపతికి లేఖలో తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు రాజధాని ప్రాంత రైతులు. కేవలం ముఖ్యమంత్రి.. పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారంటూ ఆ లేఖల్లో తెలిపారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమను పట్టించుకున్నవారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
Tags:    

Similar News