అమరావతి వర్సెస్ ఇప్పటం...పవన్ కెలుకుతోంది ఎవరిని....?

Update: 2022-11-28 07:36 GMT
అమరావతి మీద ఫుల్ పేటెంట్ హక్కులు చంద్రబాబుకే ఉన్నాయి. ఎందుకంటే ఆ పేరు సృష్టికర్త. రాజధాని నిర్మాత అన్నీ చంద్రబాబే. ఎవరు ఎన్ని విధాలుగా అమరావతికి మద్దతు ప్రకటించినా పోరాటంలో చేతులు కలిపినా అంతిమంగా క్రెడిట్ కానీ పొలిటికల్ మైలేజ్ కానీ చంద్రబాబుకే దక్కుతుంది. ఆ సంగతి తెలుసు కాబట్టే అమరావతి  రాజధాని కధని ముందుకు పోనీయకుండా వైసీపీ బిగపట్టుకుని కూర్చుంది. మూడు రాజధానుల స్లోగన్ కూడా వినిపిస్తోంది.

ఇక ఇప్పటం అన్నది అమరావతితో పోలిస్తే ఒక చిన్న కధ. అక్కడ రోడ్డు కోసం ఇళ్ళ ప్రహారీలను కూల్చేశారు. ఇది అన్ని చోట్లా జరిగేదే. పెద్ద విషయం కూడా కాదు. కానీ పవన్ ఇప్పటం ప్రజలతో అమరావతి రైతులతో పోలుస్తున్నారు. నిజానికి ఇప్పటం ప్రజలు ఏమి పోరాటం చేశారన్నది పవన్ చెప్పాలి.

అయితే ఇప్పటం అంటే కేరాఫ్ పవన్ అన్నట్లుగా కధ ఆయన మలచుకున్నారు. అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తేనేమి. అంతకు ముందు అక్కడకు వెళ్ళి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తేనేమి మొత్తానికి ఇప్పటంతో పవన్ బంధం పెరిగింది. బహుశా ఈ కారణంతోనే ఆయన ఇప్పటం గ్రేట్ అంటున్నారు అనుకోవాలి. అమరావతి అంటే బాబు ఎలా గుర్తుకువస్తారో ఇప్పటం అంటే పవన్ గుర్తుకు వస్తారు.

అక్కడ పోరాటాలు ఏమీ జరగకపోయినా రాజకీయ రచ్చ సాగింది. అది ఏపీ అంతటా హైలెట్ అయింది. అందుకే ఇప్పటం తో అమరావతిని సరిపోల్చుతూ ఒకే ఒక్క సంఘటనతో ఏపీ అంతా మారుమోగేలా చేశాం ఇప్పటం ద్వారా అని పవన్ సౌండ్ చేస్తున్నారు అన్న మాట. అదే అమరావతి రైతులు ఎన్నాళ్ళు పోరాటం చేసినా సర్కార్ ని నేరుగా ఢీ కొట్టలేకపోయారు అన్నది పవన్ ఆలోచన.

మరో విషయంలో కూడా తేడాను చెప్పవచ్చు. ఇప్పటంలో డైరెక్ట్ గా జనంలోకి పవన్ వెళ్లి వైసీపీకి సవాల్ చేశారు. అక్కడ ప్రతీ సందూ గొందూ తిరిగారు. ఆ విధంగా అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు కానీ మరే నాయకుడు కానీ దూకుడు చేయలేదు అన్నది కూడా పవన్ చెప్పే మాటల నుంచి చూస్తే విశ్లేషణగా అర్ధం చేసుకోవాలి. ఇప్పటం టాక్ ఆఫ్ ది స్టేట్ అయినపుడు అమరావతి ఎందుకు కాలేదు అన్నది ఆయన ప్రశ్న కూడా అయి ఉండవచ్చు.

ఒక రాజధాని ప్రాంతాన్ని కాదూ కూడదు అని అంటే ఎంతలా మంట పుట్టించాలి. ఎంతలా అగ్గి రగల్చాలి. కానీ అవేమీ అమరావతి రాజధాని విషయంలో జరగలేదు అన్నదే ఆయన చేసే నిందారోపణగా కూడా చూడాలి. అంటే అమరావతి రాజధాని సృష్టి కర్తగా చెప్పుకునే చంద్రబాబు అక్కడ రైతులకు ఏ మాత్రం బాసటగా తనలా దూకుడుగా నిలబడలేకపోయారు అన్న పరోక్ష విమర్శ కూడా ఇందులో ఉండి ఉండాలి. అదే టైం లో తనను నమ్ముకుటే ఇప్పటం జనానికి అండగా ఉండినట్లుగానే అమరావతి రాజధాని రైతులకు ఉంటాను అని సందేశం కూడా పవన్ ఇస్తున్నట్లుగా అర్ధం చేసుకోవాలి.

మొత్తానికి ఇప్పటం తో అమరావతిని పోల్చడం వెనక రైతుల పోరాటం కంటే టీడీపీ రాజకీయ వైఫల్యాన్నీ పవన్ ఎత్తి చూపారని భావించాలి. ఏది ఏమైనా అమరావతి రాజధాని ఉద్యమం రాజ్యాంగపరమైన రక్షణతో అలా ఉంది తప్ప అక్కడ ప్రజా పోరాటం ఏదీ ఫోకస్డ్ గా జరగలేదు, తనదే అక్కడ పేటెంట్ హక్కులు అని చెప్పుకునే తెలుగుదేశం ఆ దిశగా ప్రకంపనలు సృష్టించలేదు అన్నదే పవన్ మార్క్ విమర్శగా చూడవచ్చు అని కూడా అంటున్నారు.

ఏది ఏమైనా అమరావతి విషయంలో పవన్ వ్యాఖ్యల వెనక చాలా అర్ధాలే ఉన్నాయని భావించాలి. ఇప్పటం వైపు చూడడానికి అధికార వైసీపీ కొంత ఆలోచన పడుతోంది  అనుకుంటే రాజధాని ప్రాంతం అమరావతి విషయంలో ఇంకెంత ఆలోచన చేయాలి. ఇదీ అసలు మ్యాటర్. సో అమరావతి పేరు చెప్పి ఇండైరెక్ట్ గా బాబునే పవన్ కెలికి ఉంటారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News