అమెజాన్ కు బెజోస్ వారసుడు జాస్సీనే ఎందుకు?

Update: 2021-02-04 23:30 GMT
ఆ కంపెనీని కేవలం 26 ఏళ్ల క్రితం ప్రారంభించారు. పాతికేళ్లు అంటే మాటలా? అనుకోవచ్చు. కానీ.. 45 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఇదే ప్రశ్న అడిగి చూస్తే.. అతడు చెప్పే సమాధానం వేరుగా ఉంటుంది. కేవలం.. ఈ వ్యవధిలో ఆ కంపెనీ విలువ ఎంతంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.127.5లక్షల కోట్లు. ఏడాదిలో ఆ కంపెనీ నికర అమ్మకాలు అక్షరాల రూ.28.95 లక్షల కోట్లు. అంటే.. మన దేశ వార్షిక బడ్జెట్ కు సమానం. చాలా దేశాల వార్షిక బడ్జెట్లు కలిపినా.. ఆ కంపెనీ వార్షిక అమ్మకాలకు దగ్గరగా రావు.

ఇంతకీ ఆ కంపెనీ ఏమిటంటారా? అదేనండి.. మనం రోజులో ఒకట్రెండుసార్లు అయినా తలుచుకునే అమెజాన్. తాజాగా ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్.. తాజాగా అమెజాన్ పదవి నుంచి వైదొలిగి.. తన స్థానంలో తన వారసుడ్ని కూర్చోబెట్టే సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. అలా అని.. ఆయన కంపెనీని వీడటం లేదు. రిటైర్ కావటం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో పని చేయనున్నారు. ఇంతకీ.. తన వారసుడిగా ఆండీ జాస్సీని యాభైఏడేళ్ల జెఫ్ బెజోస్ ఎందుకు ఎంపిక చేశాడు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి పలువురు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో చాలామంది అంగీకరిస్తున్న వాదనను చూస్తే.. 53 ఏళ్ల జాస్సీ.. అమెజాన్ ను ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత కంపెనీలో చేరాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ఆయన కంపెనీలో చేరాడు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ టీంకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. బెజోస్ వారసుడిగా ఎంపిక కావటానికి కారణం.. అమెజాన్ వెబ్ సర్వీసుల్లో అతడు సాధించిన విజయమేనని చెబుతారు.

అమెజాన్ ను ఈ కామర్స్ సంస్థగానే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీగా మార్చటం.. బెజోస్ కు సాంకేతిక సహాయకుడిగా ఉండటం.. నీడలా వెన్నంటి ఉండే ఆయనకు కంపెనీలో 30 మిలియన్ డాలర్లకు పైనే షేర్లు ఉన్నాయి. ఇక.. ఆయన పని తీరు కూడా మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. పెద్ద మార్కెట్ వినియోగదారులతో నేరుగా మాట్లాడటం.. సమీక్షల్ని నేరుగా చదవి నిర్ణయాలు తీసుకోవటం.. వాటికి స్పందించటం చేస్తుంటారు.
వ్యాపార ప్రత్యర్థులతో మాట్లాడే వేళలో ఆచితూచి మాట్లాడే అలవాటు ఆయనకు లేదు. దూకుడుగా వ్యవహరిస్తారు. రెండేళ్ల క్రితం ఐబీఎం.. ఒరాకిల్ కంపెనీలతో ట్విటర్ లోనే మాటల పోరు సాగించిన ఆయన.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. మరి.. ఆయన నాయకత్వంలో అమెజాన్ ఎలా ముందుకెళుతుందో చూడాలి.
Tags:    

Similar News