హైటెక్‌ సిటీకీ మెట్రో...వ‌చ్చే వారంలోనే!

Update: 2019-02-18 09:53 GMT
సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డునుంది. చాలా రోజులుగా ఐటీ ఉద్యోగులతో పాటు హైటెక్ సిటీ ప్రాంతాల ప్రజలు హైటెక్‌ సిటీ వరకు మెట్రో ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి తీపిక‌బురు అందిస్తూ వారం రోజుల్లో హైటెక్‌ సిటీ వరకు మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కారిడార్-3కు సంబంధించి ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌ పేట వరకు మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రాగా - అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు గల 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్‌ ప్రారంభించి - రక్షణపరమైన తనిఖీలు కూడా చేపట్టారు. ఈ ఎనిమిది స్టేషన్ల 10 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వస్తే నాగోల్ నుంచి హైటెక్‌ సిటీ సమీపంలోని ట్రైడెంట్ హోటల్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలుకలుగనుంది.

హైటెక్‌ సిటీ వద్ద రివర్సల్ సౌలభ్యం లేకపోవడం అమీర్‌ పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు చేపట్టే ఆపరేషన్స్ ట్విన్ సింగిల్‌ లైన్ విధానంలో జరుగుతాయి. ఈ విధానం వల్ల మెట్రోరైళ్లు ఒకే లైన్ నుంచి వెళ్లి తిరిగి అదేలైన్‌ లో వెనుకకు రానున్నాయి. రెండు లైన్లు సిద్ధమైనప్పటికీ, రెండు లైన్లపై రాకపోకలు ఒకే డైరెక్షన్‌ లో సాగనున్నాయి. సిగ్నలింగ్ సిస్టమ్స్‌ లో సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్) విధానం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో పకడ్బందీగా పనిచేస్తుంది. ఇప్పటికే అన్నిరకాల తనిఖీలు చేపట్టి సీఈఐజీ సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ మార్గంలో రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన దాదాపు అన్ని అనుమతులు లభించాయి. సాంకేతికంగా కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ (సీఎంఆర్‌ ఎస్) అనుమతులు త్వరలో రానున్నాయి. ఉప్పల్ డిపోలో ఉన్న రైలుకోచ్‌ లను కూడా పరిశీలించారు. ఈ వారంలోనే సీఎంఆర్‌ ఎస్ అనుమతులు రానున్నట్టు సమాచారం. సీఎంఆర్‌ ఎస్ అనుమతులు వచ్చిన వెంటనే 10 కిలోమీటర్ల మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. కాగా, ప్రారంభానికి సంబంధించిన తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించబోయే 10 కిలోమీటర్ల మార్గం నగర రూపురేఖలను మార్చనున్నదని ఆయన పేర్కొన్నారు. ఇక కారిడార్-2లోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మిస్తున్న 10 కిలోమీటర్ల మార్గం ఈ ఏడాది జూలైలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే నగరంలో 46 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గం అందుబాటులోకి వచ్చి నిత్యం 1.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
Tags:    

Similar News