వేధింపుల నుంచి విముక్తి!

Update: 2015-03-16 13:30 GMT
498ఏ అనగానే భయపడే మొగుళ్లకు వారి తల్లిదండ్రులకు కాస్త ఊరటనిచ్చే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు నాన్‌బెయిలబుల్‌గా ఉన్న ఈ సెక్షన్‌ను బెయిలబుల్‌గా మార్చాలని ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా మంచి నిర్ణయమే.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అయినట్లే.. వరకట్న వేధింపుల నిరోధక చట్టం కూడా అత్యంత దారుణంగా దుర్వినియోగం అయింది. భర్త తాము చెప్పిన మాట వినకపోతే చాలు.. కొంతమంది భార్యలు అతనిపైనా అతని కుటుంబంపైనా 498ఏ కింద కేసులు పెట్టేశారు. కేసులు పెడతామని బెదిరించి భర్తలను తమ దారికి తెచ్చుకున్న భార్యలు అయితే చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే, భర్తను, అతని కుటుంబ సభ్యులను వేధించడానికి 498ఏ సెక్షన్‌ భార్యలకు, ఆమె కుటుంబ సభ్యులకు ఒక ఆయుధంలా మారిందని ఏకంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎంత తీవ్రమో ఊహించుకోవచ్చు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు 498ఏ పైనా కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ రెండు చట్టాల్లోనూ సవరణలు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ముట్టుకునే  దమ్ము ఏ ప్రభుత్వానికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కనీసం వరకట్న వేధింపులచట్టంలో సవరణలకు బీజేపీ ప్రభుత్వం సాహసించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, లా కమిషన్‌, జస్టిస్‌ మలిమత్‌ సిఫారసుల మేరకు దీనికి సవరణలు అవసరమని కేంద్ర హోం శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదలను ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఈ సవరణలు అమల్లోకి వస్తే.. కొన్ని వేలమంది అమాయక భర్తలకు ఊరట లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News