ఇప్ప‌టికైతే టీడీపీతో పొత్తు ఉందంటున్న అమిత్ షా

Update: 2017-05-23 14:17 GMT
మూడురోజుల తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా న‌ల్ల‌గొండ‌లో మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రెండో రోజు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా అనేక అంశాల‌పై స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీని బలపరిచేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15రోజుల పాటు పర్యటిస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణలో 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పార్టీని విస్తరిస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పొత్తుపై అమిత్ షా ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీతో ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు అయితే మైత్రి కొనసాగుతుందని అమిత్‌షా తెలిపారు. ఈ విష‌యంలో తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది చెప్పాన‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అమిత్ షా తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన గిరిజన రిజర్వేషన్లు స్వాగతిస్తామని, అయితే మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని అమిత్ షా స్ప‌ష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి లక్ష కోట్లు ఇచ్చామని అమిత్‌ షా అన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా పదింతలైందన్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నాలుగున్నర రెట్లు పెరిగిందని   అమిత్ షా అన్నారు. స్థానిక సంస్థల కోసం రూ.8,74 కోట్లు ఇచ్చామన్నారు. రహదారుల కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామన్నారు. తెలంగాణకు ఎయిమ్స్‌, హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ వర్సిటీలు మంజూరు చేస్తున్నామన్నారు.

యూపీఏ హయాంలో వ్యవస్థ మొత్తం అచేతనంగా మారిపోయిందని, అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అమిత్ షా తెలిపారు. బీజేపీ అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తోందని, బీజేపీ మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి-సంక్షేమ పాల‌నతో ముందుకు సాగుతున్నామ‌ని అమిత్ షా వివ‌రించారు. మోడీ పాలనలో జీడీపీ వృద్ది చెందిందని, ధరలు దిగివచ్చాయని తెలిపారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. 2018లోగా 13వేల గ్రామాలకు విద్యుత్‌ అందించాలనే లక్ష్యమన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా 4కోట్ల మందికి పైగా రుణాలు అందించామని తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి ప్రపంచంలో భారత్‌ సత్తాని చాటామన్నారు. యూపీఏపై రూ.12లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయని  అమిత్ షా అన్నారు.
Tags:    

Similar News