సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌పై అమిత్‌ షా హాట్‌ కామెంట్స్‌!

Update: 2022-11-01 08:43 GMT
దేశ తొలి ఉప ప్రధాని, తొలి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను దేశానికి తొలి ప్రధానమంత్రిగా చేసి ఉంటే నేడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉండేవి కావని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇది తన అభిప్రాయం కాదని.. దేశ ప్రజల్లోనే ఈ మేరకు ఒక అభిప్రాయం ఉందని అమిత్‌ షా చెప్పారు.

అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ విద్యాలయలో అమిత్‌ షా మాట్లాడారు. వల్లభాయ్‌ పటేల్‌ ఘనతను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలూ జరిగాయని అమిత్‌ షా సంచలన ఆరోపణలు చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లేకపోతే దేశ చిత్రపటం ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదన్నారు.

విద్యార్థులు, యువత వల్లబాయ్‌ పటేల్‌ ఆశయ సాధనకు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వల్లభాయ్‌ పటేల్‌ జీవితాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు. స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య ప్రాధాన్యాన్ని అమిత్‌ షా ప్రస్తావించారు. విద్యార్థులు తమ మాతృభాష, యాసలను సజీవంగా ఉంచుకోవాలని హితవు పలికారు.

సర్దార్‌ పటేల్‌ తన దార్శనికతను అమల్లోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డారని అమిత్‌ షా కొనియాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఒక కర్మయోగి అని ప్రస్తుతించారు. తనను తాను ప్రచారం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించని నాయకుల్లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఒకరని ప్రశంసించారు.

ఆరోగ్యం దెబ్బతిన్నా.. తెల్లవార్లు సర్దార్‌ పటేల్‌ పని చేసేవారని అమిత్‌ షా తెలిపారు. జునాగఢ్‌ సంస్థానం విలీనంపై తెల్లవారుజామున 4.20 గంటలకు సంతకం చేశార ని గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను భారత్‌కు తొలి ప్రధానిగా చేసి ఉంటే.. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవే కావన్నారు. దేశ ప్రజలు ఇదే విషయాన్ని నమ్ముతారన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News