దెబ్బ పడితే గానీ... అమిత్ షా దిగిరాలేదబ్బా!

Update: 2019-12-25 16:15 GMT
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) - జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) మీదే చర్చ జరుగుతోంది. జాతీయ జనాభా జాబితా(ఎన్ పీఆర్)కు కేంద్రం నిధులు విడుదల చేసినా కూడా ఎన్నార్సీ అమలుకే కేంద్రం దొడ్డిదారిన రంగం సిద్ధం చేస్తోందంటూ చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల్లో ఓ విధమైన భయాందోళనకు బీజం వేసిందనే చెప్పాలి. సీఏఏపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతుండగానే... జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో తగిలిన గట్టి దెబ్బతో మోదీ సర్కారు కూడా యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఈ క్రమంలో అటు సీఏఏ అయినా, ఇటు ఎన్నార్సీ అయినా... రెండింటి అమలుకూ కేంద్ర బిందువుగా మారిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి నాలిక మడతేశారు. ఇప్పటికే సీఏఏకు పార్లమెంటులో ఆమోదం లభించేలా వ్యూహం అమలు చేసిన షా... ఎన్నార్సీపై మాత్రం వెనకడుగు వేస్తున్నట్లుగా చాలా స్పష్టంగానే సంకేతాలు ఇచ్చారు.

సీఏఏ అమలును చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే జార్ఖండ్ ఫలితాలు రావడంతో ఆయా రాష్ట్రాలతో మరింత లోతుగా చర్చలు జరిపి... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించేందుకు యత్నిస్తామని చెప్పిన అమిత్ షా... ఎన్నార్సీని మాత్రం పూర్తిగా పక్కనపెట్టేశామన్న అర్థం వచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ పీఆర్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేసిన దరిమిలా... ఎన్నార్సీని అమలు చేసేందుకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్న వేళ... ఓ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అమిత్ షా... అసలు ఎన్నార్సీతో ఎన్ పీఆర్ కు సంబంధమే లేదని తేల్చేశారు. అవగాహనా రాహిత్యంంతో ఎన్నార్సీ, ఎన్ పీఆర్ రెండూ ఒకటేనంటూ కొందరు చేస్తున్న ఆరోపణల కారణంగానే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, సదరు భయాలను తొలగించడం తమ బాధ్యత అన్న దిశగా అమిత్ షా చెప్పుకురావడం నిజంగానే ఆసక్తికరమేని చెప్పక తప్పదు. ఎన్ పీఆర్ కు ఎన్నార్సీతో ఎలాంటి సంబంధం లేదని కూడా అమిత్ షా ఈ సందర్భంగా పదే పదే చెప్పడం చూస్తుంటే... జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఆయనకు ఏ మేర షాకిచ్చాయన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాల పుణ్యమా అని దేశ ప్రజలను ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన ఎన్నార్సీపై తాము వెనకడుగు వేస్తున్నట్లుగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమేనని చెప్పాలి. అయితే అదే సమయంలో ఇప్పటికే చట్టంగా మారిపోయిన సీఏఏను మాత్రం అమలు చేసి తీరతామని, అది కూడా దానిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో చర్చలు జరిపి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించిన తర్వాతే ముందడుగు వేస్తామని అమిత్ షా చెప్పడం విశేషం. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు... ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా.. సీఏఏను అమలు చేసి తీరతామని ప్రకటించిన అమిత్ షా... జార్ఖండ్ ఫలితాల తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించిన తర్వతే సీఏఏపై ముందడుగు వేస్తామని చెప్పడం చూస్తుంటే... నిజంగానే జార్ఖండ్ ఎన్నికలకు అమిత్ షాతో పాటుగా మొత్తం మోదీ బ్యాచ్ కు భారీ దెబ్బే వేశాయన్న వాదన వినిపిస్తోంది.
    

Tags:    

Similar News