బాబు వెళ్లినందుకు మాకేమీ న‌ష్టం లేదు

Update: 2018-03-22 09:53 GMT
లోప‌ల సంగ‌తేమో కానీ.. బ‌య‌ట‌కు మాత్రం యమా ధీమాగా మాట్లాడారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.  హోదా అంశంపై బాబు ఉన్న‌ట్లుండి సీరియ‌స్ కావ‌ట‌మే కాదు.. కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోని మంత్రుల్ని ఉప‌సంహ‌రించుకోవ‌టం త‌ర్వాత ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లాంటి ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకున్నారు. హోదాపై ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ హాట్ రాజ‌కీయం సాగుతున్న వేళ‌.. ఇంత‌కాలం మౌనంగా ఉన్న అమిత్ షా.. ఒక జాతీయ ఛాన‌ల్ తో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ వ్య‌వ‌హారాల‌పై స్పందించారు. ఏన్డీయే కూట‌మి నుంచి టీడీపీ వైదొల‌గ‌టం గురించి మాట్లాడారు. టీడీపీ వెళ్లిపోవాల‌ని తాము కోరుకోలేద‌ని.. వారికి వారే వెళ్లిపోయార‌ని.. అందుకు తామేమీ చెప్ప‌గ‌ల‌మ‌న్నారు. ఎన్డీయే ప‌ట్ల బాబే ఆక‌ర్షితుల‌య్యార‌ని చెప్పారు.

టీడీపీ  బ‌య‌ట‌కు వెళ్లినంత మాత్రాన  త‌మ‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని.. త‌మ కూట‌మికి 30 పార్టీల మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. అలాంటి వేళ తాము ఎందుకు బాధ ప‌డాల‌న్న ఎదురు ప్ర‌శ్న వేసిన అమిత్ షాను స‌ద‌రు ఛాన‌ల్ ప్ర‌తినిధి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఒక‌టి సంధించారు. బాబు ఎగ్జిట్ త‌ర్వాత సౌత్ మీద మీరు పెట్టుకున్న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్లుగా భావిస్తున్నారా? అని అడ‌గ్గా.. తాము అలా అనుకోవ‌టం లేద‌ని.. తాము బ‌లంగా ఉన్నామ‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. లోగుట్టు ఒప్పందాల మీద‌.. ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారంటారా?
Tags:    

Similar News