క‌పిల్ కొత్త ఇన్నింగ్స్ ను షా సెట్ చేశారా?

Update: 2018-06-07 04:40 GMT
హ‌ర్యానా హ‌రికేన్ గా.. భార‌త్‌ కు తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్ అందించిన క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్ గా క‌పిల్ దేవ్ సుప‌రిచితుడు. గ‌తంలో ఆయ‌న్ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రావాల‌ని కోరినా.. సున్నితంగా తిర‌స్క‌రించిన ఆయ‌న్ను.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఇవ్వ‌టం ద్వారా పార్ల‌మెంటుకు పంపాల‌ని బీజేపీ భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల ముగిసిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల్లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని రాష్ట్రప‌తి నామినేట్ చేయ‌టం ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఏడు స్థానాల్ని వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు క‌ట్ట‌బెడుతుంటారు. గ‌తంలో క్రీడా రంగానికి సంబంధించి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌టం తెలిసిందే. అయితే.. రాజ్య‌స‌భకు హాజ‌ర‌య్యే విష‌యంలో స‌చిన్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అతి త‌క్కువ‌సార్లు రాజ్య‌స‌భ‌కు హాజ‌రైన ఆయ‌న తీరు ప‌లువురికి అసంతృప్తిని ర‌గిలించింది.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీ.. అకాలీద‌ళ్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. అందుకు క‌పిల్ నో చెప్పారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయాల వైపు క‌పిల్ దృష్టి సారించింది లేదు. అయితే.. ఆయ‌న్ను క్రీడారంగ కోటా నుంచి రాజ్య‌స‌భ‌కు పంపాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ అధినాయ‌క‌త్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తాజాగా సంప‌ర్క్ ఫ‌ర్ స‌మ‌ర్ధ‌న్ పేరుతో దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. ప‌లువురు ప్ర‌ముఖులతో భేటీ కావ‌టం తెలిసిందే. నాలుగేళ్ల మోడీ పాల‌న పూర్తి చేసిన నేప‌థ్యంలో ఆయ‌నీ యాత్ర‌ను చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఢిల్లీలో మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌నున్నట్లుగా షా చెప్పిన‌ట్లుగా తెలిసింది. దీనిపై కపిల్ అధికారిక ప్ర‌క‌ట‌న ఏమీ చేయ‌లేదు. రాష్ట్రప‌తి నామినేట్ చేసే జాబితాలో క‌పిల్ కు అవ‌కాశం ల‌భిస్తున్న వైనం అధికారికంగా బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. ఇందుకు సంబంధించి జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. షా ప్ర‌తిపాద‌న‌కు క‌పిల్ ఓకే అంటే.. ఈ మాజీ క్రికెట‌ర్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయిన‌ట్లే.
Tags:    

Similar News