సీమసిగలో కమల వికాసం.. అమిత్ షా వ్యూహం?

Update: 2019-10-24 08:02 GMT
ఒకవైపు తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ పరిస్థితి పడుతూ లేస్తూ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కేవలం ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితం అయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా మూడు ఎంపీ సీట్లను పొందింది. మళ్లీ  హుజూర్ నగర్ బై పోల్ లో డిపాజిట్ కూడా దక్కడం లేదు!

ఇలా ఉంది కమలం పార్టీ పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి  సౌత్ లో ఎంతో కొంత అనుకూల పరిస్థితి ఉన్న వాటిల్లో తెలంగాణ ముఖ్యమైనది అని చెప్పవచ్చు. దశాబ్దాలుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత ఉనికిని చాటుతూ వచ్చింది కూడా. కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కమలం పార్టీ తెలంగాణలో పాగా వేయడానికి ఐదేళ్లుగా కష్టపడుతూనే ఉంది. అయినా ఫలితాలు అంతంత మాత్రం.

అయితే ఇంతలో ఏపీలో పాగా వేస్తామంటూ బీజేపీ వాళ్లు ప్రకటించుకుంటూ ఉన్నారు. ఏపీలో తామే ప్రత్యామ్నాయం అని, ఏపీలో అధికారం దిశగా.. అంటూ వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో ఇప్పుడు బీజేపీలో హడావుడి చేస్తున్దని అంతా అద్దె నేతలే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలోకి కొంతమంది టీడీపీ నుంచి చేరారు. మరి కొందరు చేరుతూ ఉన్నారు.

మరి ఆ మాత్రం దానికే అధికారం సాధ్యమా? అంటే.. అమిత్ షా పేరు చెబుతున్నారు కమలనాథులు. ముందుగా రాయలసీమ మీద అమిత్ షా దృష్టి  పెట్టారని.. అక్కడ పార్టీని  బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అందుకే అక్కడ తెలుగుదేశం నేతలను చేర్చుకోవడానికి బీజేపీ  ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా  ప్రకటించుకున్నారు.

అయితే అక్కడ కూడా అంతా వలస పక్షులకే బీజేపీ కండువాలు వేయగలుగుతూ ఉంది. అధికారం ఎక్కడుండటే  అక్కడకు చేరే నేతలు,అవినీతి తో సహా రకరకాల కేసుల భయం ఉన్న వాళ్లు బీజేపీలోకి చేరుతున్నారు.
అంతే తప్ప క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్లు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీ వైపు చూడటం లేదు. ఇది భారతీయ జనతా పార్టీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ,  అమిత్ షా గొప్ప వ్యూహకర్తే  అయినప్పటికీ..  స్థానికంగా బలీయమైన నేతలు తయారు లేకపోతే ఎవరూ ఏం చేయలేరు. సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి  లాంటి వాళ్లను నమ్ముకుని భారతీయ జనతా పార్టీ రాయలసీమలో రాజకీయం చేస్తే.. అది కామెడీనే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక అన్నింటికీ మించి రాష్ట్రాన్ని  బీజేపీ ఎంత వరకూ ఉద్ధరిస్తూ ఉంది? అనేది మరో కీలకమైన అంశం.

ప్రత్యేకహోదా కు బీజేపీ పంగనామాలు పెట్టింది. నిధులు కేలాయింపు, విడుదలలు లేవు. న్యాయంగా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదు. ఒకరంగా బీజేపీ ఏపీని దారుణంగా మోసం చేసింది. అలాంటప్పుడు రాయలసీమలో అయినా ఆ పార్టీని జనాలు ఎలా ఆదరిస్తారు? రాయలసీమకు ఇవ్వాల్సిన వెనుకబడిన జిల్లాల నిధులకు కూడా  కమలం పార్టీ ఢిల్లీ నుంచి ఇవ్వడం  లేదు! ప్రజలు మాత్రం ఓట్లేస్తారా? ఓట్లు వేయాలా?
Tags:    

Similar News