కొట్లాటలు వద్దు.. కామ్ గా ఉండమన్నారట

Update: 2015-12-11 03:59 GMT
అవసరం ఉన్నా లేకున్నా తమ్ముళ్లపై కారాలు మిరియాలు నూరే కమలనాథులకు బ్రేకులు పడ్డాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. తత్వం బోధ పడిన బీజేపీ చీఫ్ కళ్లు తెరిచినట్లుగా చెబుతున్నారు. వాపును బలుపుగా చూసుకొని మురిసిపోయిన బీజేపీ అగ్రనేతలకు.. మిత్రుల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందట. సార్వత్రిక ఎన్నికల విజయంతో పెరిగిన ధీమాతో.. తమ బలాన్ని తాము ఎక్కువగా ఊహించుకొని.. రాష్ట్రాల్లోని మిత్రపక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్లాన్ ను పక్కన పడేసి.. వారితో కలిసిమెలిసి పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఏపీ అధికారపక్షంతో జాగ్రత్తగా ఉండాలని.. అనవసరమైన వ్యాఖ్యలు.. విమర్శలు అస్సలు చేయొద్దంటూ బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా ఏపీ నేతలకు స్పష్టం చేశారట. నిన్నటివరకూ బాబు సర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసేందుకు స్వేచ్ఛ ఇచ్చిన అధినాయకత్వం ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు జారీ చేయటంతో కమలనాథులు కంగుతిన్న పరిస్థితి. బాబుతో ఏదైనా సమస్యలు ఉంటే తమకు చెప్పాలే కానీ.. ఎవరూ సొంతంగా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఉత్తరాదిలో పార్టీ బలం తగ్గుతున్న క్రమంలో.. 2019 నాటి ఎన్నికల సమయానికి దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటు.. కొత్త మిత్రుల అవసరం ఉంటుందని పార్టీ అధినాయకత్వం గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉన్న మిత్రుల్ని నిలుపుకోవటం కీలకంగా గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం తెలుగు రాష్ట్రాల్లోని కమలనాథులకు సరికొత్త ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం అండతో నిన్నమొన్నటివరకూ బాబు మీద ఒంటి కాలి మీద లేచిన బీజేపీ బ్యాచ్ ఇప్పుడు కామ్ గా ఉండటానికి కారణమిదే అంటున్నారు. తాజా పరిణామం ఏపీలో బీజేపీ నేతలకు మింగుడుపడని వ్యవహారంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News