ఆ రాష్ట్ర హోం మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న అమిత్‌ షా!

Update: 2022-10-28 08:41 GMT
హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల చింతన్‌ శిబిర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హరియాణా హోం శాఖ మంత్రి మాట్లాడుతుండగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

అయితే నిర్దేశించిన సమయం కంటే హరియాణా హోం మంత్రి అనిల్‌ వీజే ప్రసంగిస్తుండటంతోనే అమిత్‌ షా ఇలా చేశారని తెలుస్తోంది. అప్పటికే నిర్దేశించిన సమయం 5 నిమిషాల కంటే అనిల్‌ వీజే ప్రసంగిస్తుండటంతో అమిత్‌ షా ఆయనను రెండు మూడుసార్లు వారించడానికి ప్రయత్నించారు. అయినా అనిల్‌ వినకపోవడంతో ఆయన ప్రసంగాన్ని ముగిస్తున్నట్టు అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

కాగా ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని వెల్లడించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్ర భారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్‌ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందామని అమిత్‌ షా పిలుపునిచ్చారు.

జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్‌ విజయం సాధించిందని అమిత్‌ షా తెలిపారు. పశుపతి(నాథ్‌) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేదని.. అది ఇప్పుడు సద్దుమణిగిందన్నారు.

అందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దామని అమిత్‌ షా రాష్ట్రాల హోం మంత్రులకు పిలుపునిచ్చారు. ఇది మనందరి సమష్టి బాధ్యత అని చెప్పారు.

కొన్ని ఎన్‌జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని గుర్తు చేశారు. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయని అమిత్‌ షా మండిపడ్డారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News