అమ్మ ‘చివరి మాట’ను చెప్పిన చిన్నమ్మ

Update: 2017-02-13 06:47 GMT
అనారోగ్యంతో అమ్మ అపోలోఆసుపత్రిలో చేరిన వేళ.. ఆమె దగ్గరకు వెళ్లేందుకు చాలామంది వీవీఐపీలు వెళ్లినప్పటికీ.. వారంతా అమ్మను కాదు.. చిన్నమ్మ వరకే వెళ్లారన్న కొత్త విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వెల్లడించాయి. రోజుకు మూడుసార్లు ఠంచనుగా వెళ్లే పన్నీర్ సెల్వం లాంటి నేత సైతం.. అమ్మను ఒక్కసారంటే ఒక్కసారి కూడా చూడలేదని..ఆమెకు ఆ అవకాశాన్నిశశికళ ఇవ్వలేదని ఈ మధ్యన ఆయన వాపోవటం తెలిసిందే.

తనకు చికిత్స జరుగుతున్న రోజుల్లో అమ్మ ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఆమె ఊపిరి ఆగటానికి ముందు.. ఆమె నోటి నుంచి వచ్చిన చివరి మాట ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఏకైక వ్యక్తి చిన్నమ్మ మాత్రమే. అయితే.. ఇప్పటివరకూ ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పని ఆమె.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శశికళ ఇలాంటి విషయాలపై నోరు విప్పుతున్నారు.

ఆసుపత్రిలో అన్నిరోజులు అమ్మకు చికిత్స చేసినా.. అమ్మ పక్కన ఉన్నది మాత్రం చిన్నమ్మ మాత్రమే. దీంతో.. అమ్మ మాట్లాడిన మాటలేమిటన్నది ఆమెకు తప్పించి మరెవరికీ అర్థమయ్యే అవకాశమే లేదు. వైద్యులు.. నర్సులు.. సహాయకులు ఇలాంటి వారు కాకుండా వైద్యరంగానికి సంబంధం లేకుండా అమ్మ దగ్గర ఉన్న ఏకైకవ్యక్తి శశికళనే.

విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో.. మెజార్టీ ఎమ్మెల్యేలు తన వద్దనే ఉన్నా.. ఏ నిమిషంలో అయినా వారిలో ఎక్కువ మంది తన నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తున్న వేళ.. చిన్నమ్మ తన వర్గీయులతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మ చెప్పిన చివరి మాట ఏమిటో తెలుసా అంటూ.. ‘‘మన పార్టీని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు’ అని చెప్పారన్నారు. ఆ మాటలు తనతో అమ్మ చెప్పినట్లుగా చిన్నమ్మ వెల్లడించారు.

పార్టీని కాపాడేందుకు కావాలంటే తాను ప్రాణత్యాగం చేస్తానని చెప్పిన చిన్నమ్మ.. పార్టీనే ఆస్తిగా అమ్మ తమకు ఇచ్చారన్నారు. అన్నాడీఎంకేలో ఎవరూ పెద్దగా చదువుకోకున్నా.. ఒకరోజు వాళ్లుఎమ్మెల్యేలు అయ్యేలా జయలలిత వారికి శిక్షణ ఇచ్చారని.. ఆమె చేసిన సేవల్ని మర్చిపోవద్దని చెప్పటం గమనార్హం. ప్రతిపక్షాలు తమనుతొక్కేయాలని చూస్తున్నారన్న శశికళ.. అమ్మను వాళ్లేం చేయలేకపోయారని.. తనను కూడా ఏమీ చేయలేరని గర్జించటం గమనార్హం. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని చెబుతున్న చిన్నమ్మ.. అంతదాకాఎందుకు కాస్త ఆశ తగ్గించుకొని.. ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదనుకుంటే అంతా సెట్ అవుతుంది కదా? మరి.. ఆ పని ఎందుకు చేయరు? ఇక.. అమ్మచెప్పిన చివరి మాట అంటూ చెబుతున్న చిన్నమ్మ.. ఆ మాటను ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదు..?
Tags:    

Similar News