ఆంఫన్ దెబ్బకి పశ్చిమబెంగాల్ ‌లో 72 మంది మృతి!

Update: 2020-05-21 12:35 GMT
ఓవైపు వైరస్ దేశంలో  విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ ‌డౌన్ లో ఉండిపోయింది. మరోవైపు ఆంఫన్ తుపాను విరుచుకుపడుతోంది. ఈ  అంఫాన్ తుఫాన్ తీరంలో అల్లకల్లోలం సృష్టించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షం - ఈదురు గాలుల బీభత్సానికి చెట్లు - స్తంభాలు నేలకొరిగాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.  తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌ లో 72 మంది మరణించారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ఆమె ప్రకటించారు.

అలాగే ,తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని,  బెంగాల్‌ ను కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌ లో పర్యటించాలని కోరారు. తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కాగా, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ తెలిపింది.

ఇరు రాష్ట్రాలోనూ భారీ గాలులు - వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. హౌరా జిల్లా మణికాన్‌ లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. బెంగాల్‌ లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. బెంగాల్‌ లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై బీజేపీ విచారం వ్యక్తం చేసింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News