అనుకున్న‌ట్టే మ‌హాపాద‌యాత్ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌ర‌ణ‌.. హైకోర్టు ఏం చేయ‌నుంది?

Update: 2022-09-09 04:34 GMT
అంతా అనుకున్న‌ట్టే.. ఊహించిన‌ట్టే జ‌రిగింది. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌-2కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ అమ‌రావ‌తి రైతులు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కు పేరుతో మ‌హాపాద‌యాత్ర‌-2కు సంక‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తి ఉద్య‌మం మొద‌లుపెట్టి సెప్టెంబ‌ర్ 12కు 1,000 రోజులు పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో ఆ రోజున అమ‌రావ‌తి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ప్ర‌ముఖ సూర్య దేవాల‌యం అర‌సవెల్లి వ‌ర‌కు రైతులు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు అనుమ‌తించాల‌ని పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి అనుమ‌తి నిరాకరిస్తూ సెప్టెంబ‌ర్ 8 గురువారం అర్ద‌రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు అనే పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమ‌ల వ‌ర‌కు ఇప్ప‌టికే పాద‌యాత్ర నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీనికి మొద‌ట పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అయితే రాజ‌ధాని రైతులు హైకోర్టు ఆశ్ర‌యించి త‌మ‌కు అనుకూలంగా ఉత్త‌ర్వులు తెచ్చుకున్నారు.

ఇప్పుడు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించ‌డంతో రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని విన్న‌వించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తున్న‌ట్టు డీజీపీ పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రతిని సెప్టెంబ‌ర్ 8న‌ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపార‌ని చెబుతున్నారు.

డీజీపీ ఉత్త‌ర్వుల్లో ఏముందంటే... ‘మీరు సెప్టెంబర్‌ 12 నుంచి మహాపాదయాత్ర చేయడానికి అనుమతి అడిగారు. దానిలో 200 మందికి పైగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళతామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లాల పోలీసు అధికారులకు పంపి అభిప్రాయం తెలుసుకున్నాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ ఉత్తర్వులిస్తున్నాను. గతేడాది మీరు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో మీకు అనుమతిచ్చాం. పాదయాత్రలో మీరు ఆ షరతులన్నీ ఉల్లంఘించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయపరచటం, వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అందుకు వివిధ జిల్లాల్లో మీపై 71 క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. రెండు కేసుల్లో మీకు శిక్ష కూడా పడింది.

ఇప్పుడు మీరు పాదయాత్ర కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆకాంక్షలు ఉన్నాయి. ప్ర‌భుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా మీ పాదయాత్ర మార్గంలో ఉంది. 200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే ఆ సంఖ్య పెరిగితే చిన్న చిన్న బృందాలుగా మార్చుకుని వెళతామంటున్నారు.. అంటే ఎంతమంది వస్తారన్నదానిపై మీకే నియంత్రణ ఉండదని అర్థమవుతోంది.

పాదయాత్రలో ఎవరు పాల్గొంటారో, ఎంత మంది పాల్గొంటారో తెలియనప్పుడు, వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా అధికారులకు కష్టమవుతుంది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. యాత్రలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఇంత మందికి భద్రత కల్పించడం చాలా కష్టం.

కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలో రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతిభద్రతల సమస్యగా మారి మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టడం వరకు వెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మీ పాదయాత్ర ఆ జిల్లా మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నాం’ అని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు రైతులు హైకోర్టుపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు డీజీపీ ఉత్త‌ర్వుల‌ను త‌మ ముందుంచాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబ‌ర్ 9న (నేడు) హైకోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో మాదిరిగా అనుమతిస్తుందా లేక నిరాక‌రిస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News