వాళ్ల సంగతి మనకెందుకు బాబూ!

Update: 2018-01-11 04:14 GMT
మీరు మీకోసం ఓ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారనుకోండి. మీకు నచ్చిన డిజైనుతో మీరు కట్టుకోవచ్చు. డిజైను ఇలా ఉందే అని అడిగేవాళ్లుండరు. అడగడానికి వీల్లేదు కూడా!! కానీ మీరు అదే ఇల్లును అమరావతి రాజధానిలో కట్టుకోవాలని అనుకున్నారనుకోండి.. మీ పని అంతే! ముందు మీరు డిజైన్లు సిద్ధం చేయించాలి.. వాటిని ముఖ్యమంత్రికి నివేదించాలి.. ఆయన వాటిని సీఆర్డీయే తో భేటీ అయి చర్చించాలి.. ఆ డిజైన్లలో ఆయన తన మార్కు సూచనలు చేయాలి.. వీలైతే రాజమౌళిని గానీ - బోయపాటి శ్రీను ను గానీ పిలిపించి.. వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి.. ఆ తర్వాత ఆయన డిజైన్ ను ఆయన ఆమోదిస్తే ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు...!! కొంచెం అతిశయంగా అనిపించినప్పటికీ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఇంచుమించుగా ఇదే ధోరణిలో ముందుకు సాగుతోంది. అమరావతి రాజధానిలో అమృత్ యూనివర్సిటీ వారికి ప్రభుత్వం స్థలం విక్రయించింది. ఇప్పటికే బెంగుళూరు - కోయంబత్తూరు - కేరళల్లో యూనివర్సిటీ శాఖలను కలిగి ఉన్న వారు అమరావతిలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇక్కడ వారి భవనాలు ఎలా ఉండాలో చంద్రబాబు డిసైడ్ చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తరఫున కట్టవలసిన భవనాలకు ఇప్పటిదాకా అతీ గతీ లేదు. తమ ప్రభుత్వం చేయాల్సిన పని మితిమీరిన జాప్యం అవుతున్నట్లుగా ప్రజలు గుర్తిస్తే చేతగానితనం బయటపడిపోతుందేమో అని ఆయన ప్రెవేటు నిర్మాణాల డిజైన్లను కూడా తానే ఓకే చేస్తూన్నారేమో అని ప్రజలు అనుకుంటున్నారు.

అమృత్ యూనివర్సిటీ కి ఏపీ సర్కారు రాజధానిలో 200 ఎకరాల స్థలం ఇచ్చింది. 150 ఎకరాల్లో ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఆగస్టు 2వ వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారనేది అంచనా. ఇంకా అనేక యూనివర్సిటీలకు కూడా స్థలం కేటాయింపులు ముమ్మరంగానే జరిగాయి గానీ.. వాటి భవనాల సంగతి ఏంటో ఎప్పటికో తెలియడం లేదు. ప్రభుత్వం నిర్మించాల్సిన భవనాల సంగతి.. అసలు ఈ ప్రభుత్వ కాలంలో పునాదుల వరకు అయినా జరుగుతుందా లేదా అనేది కూడా సంశయంగానే మారుతోంది.

అయినా అమృత్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలకు అనుమతులు ఇస్తున్నప్పుడు మీ సంస్థ నుంచి మీరు దేశానికి ఉపయోగపడే సైంటిస్టులను - వృత్తి నిపుణులను - మహనీయుల్ని తయారు చేయాలని సీఎం కోరితే అది భావ్యంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఒక అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలను - దౌత్యవేత్తలు - ఆర్థికవేత్తలను తయారు చేయాలని ఆయన ఆశించాలి. అంతే తప్ప.. మీ భవనాలు చూడగానే అందరినీ ఆకట్టుకోవాలి.. అందరూ ఢామ్మని పడిపోవాలి అంటూ హితబోధ చేయడం ఎలా సబబు. పైన పటారం.. లోన లొటారం గా మారితే.. అలాంటి దండగమాలిన యూనివర్సిటీలు ఎంతో అందమైన భవనాలతో ఉన్నంత మాత్రాన.. రాజధాని అమరావతికి ఏం గౌరవం దక్కుతుంది. చంద్రబాబే స్వయంగా ఇలాంటి పైపై మెరుగులను ప్రోత్సహించడం ఎందుకు అని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News