ఉద్యోగుల నిరసనలు షూరు.. అమెజాన్ ఏం చేయబోతుంది?

Update: 2022-11-25 16:30 GMT
అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఉన్నాయి. ఈ కామర్స్ రంగంలో అమెజాన్ దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెల్సిందే. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఈ కంపెనీపై ఆధారపడి పని చేస్తున్నారు. రోజువారీ.. కమీషన్.. షిప్ట్ బేసిస్.. పర్మినెంట్ విధానంలో అమెజాన్ లక్షలాది మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది.

కరోనా సమయంలోనూ అమెజాన్ సంస్థ తమ కంపెనీ వినియోగదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా  ఉత్పత్తులను అందించింది. అయితే ఇటీవల కాలంలో ప్రముఖ ఆన్ లైన్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్ సైతం కొంతమేరకు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.

గత కొద్దిరోజులుగా భారత్ సహా వివిధ దేశాల్లో పని చేస్తున్న అమెజాన్ వర్కర్లపై క్రమంగా వేటు వేస్తోంది. ఇలాంటి సమయంలోనే అమెజాన్ కు చెందిన 40 దేశాల వర్కర్లు నేడు ఉద్యోగులను బహిష్కరించారు. భారత్.. అమెరికా.. బ్రిటన్ తదితర 40 దేశాలకు చెందిన వర్కర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో సంస్థ కార్యకలాపాలు భారీ ఎత్తున స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అమెజాన్ వర్కర్లు చేపడుతున్న సమ్మెకు ఆయా దేశాల్లోని ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లోనూ పలు ట్రేడ్ యూనియన్లు అమెజాన్ వర్కర్లకు అండగా నిలిచాయి. వర్కర్లకు కనీస వేతనం రూ. 25 వేలకు పెంచాలని.. పనివేళలు తగ్గించాలని.. వర్కర్లకు మెరుగైన సదుపాయాలని కల్పించాలనే డిమాండ్ తో వర్కర్లు విధులను బహిష్కరించినట్లు తెలుస్తోంది.
 
ఒకవైపు అమెజాన్ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో వర్కర్లు తమకు జీతాలు పెంచాలని నిరసనలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల సమ్మెను సాకుగా చూపించి అమెజాన్ మరింత మందిని ఉద్యోగుల నుంచి తొలగించే అవకాశం లేక పోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అమెజాన్ భారీగా తొలగిస్తున్న ఉద్యోగుల జాబితాలో భారతీయులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో అమెజాన్ 50 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అయితే అమెజాన్ అనుకున్న లాభాలు మాత్రం రాబట్టలేకపోతుంది. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం బడా కంపెనీలపై ప్రభావం చూపుతోంది.

ఈ నేపథ్యంలో అమెజాన్ సైతం మిగతా కంపెనీల బాటలో పయనిస్తూ తమ ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ పరంపర ఇంకా కొనసాగుతున్న సమయంలో అమెజాన్ ఉద్యోగులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ప్రముఖ కంపెనీలన్నీ వరుసబెట్టి ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News