మోడీపై కోపాన్ని ఆంధ్రాబ్యాంకుపై చూపించారు..

Update: 2016-11-29 11:21 GMT
న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డానికి పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని చెబుతున్న ప్ర‌జ‌ల గొంతుకు క్ర‌మంగా మారుతోందా... వారిలో అస‌హ‌నం పెల్లుబుకుతోందా... నాలుగు రోజులుగా ఎక్క‌డా నోట‌న్న‌ది దొర‌క్క‌పోవ‌డంతో ఆగ్ర‌హ జ్వాలలు మొద‌ల‌వుతున్నాయా అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా ఘ‌ట‌న‌లు. న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టి నుంచి జ‌నం బ్యాంకులు - ఏటీఎంల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నా ఎక్క‌డా ఉద్రేక ప‌డిన సంద‌ర్భాలు లేవు. కానీ.. తాజాగా ఏపీలో మాత్రం ఒక బ్యాంకు ప‌గ‌ల‌గొట్ట‌డంతో ప్ర‌జ‌ల్లో కోపం పెరుగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రా బ్యాంకు వద్ద గంటల కొద్దీ క్యూలైన్లలో అవస్థలు పడుతున్న వారి పట్ల బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ - ప్రజలు బ్యాంకుపై దాడికి దిగారు. తమకు వెంటనే డబ్బు చెల్లించాలంటూ, బ్యాంకులోకి ప్రవేశించి అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ప్రజలను అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు పత్తిపాడులోనూ బ్యాంకుల సిబ్బంది ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ, ఖాతాదారులు నిరసనలకు దిగారు.

ఇత‌ర రాష్ట్రాల్లోనూ అక్క‌డ‌క్క‌డా ఇలాంటి నిర‌స‌న‌లు క‌నిపిస్తున్నా బ్యాంకుల‌ను ప‌గ‌ల‌గొట్టిన స్థాయి ఘ‌ట‌న‌లు న‌మోదు కావ‌డం లేదు. దీంతో తాజా ఘ‌ట‌న‌తో బ్యాంకు ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వంపై కోపాన్ని ప్ర‌జ‌లు త‌మ‌పై చూపిస్తున్నార‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు. ఇదెక్క‌డికి దారితీస్తుందోన‌న్న టెన్ష‌న్ వారిలో మొద‌లైంది. అయితే... ప్ర‌భుత్వానికి చేరుతున్న న‌ల్ల‌ధ‌న‌మంతా పేద‌ల‌కే చెందేలా చేస్తాన‌ని మోడీ తాజాగా ప్ర‌క‌టించ‌డంతో ప‌రిస్థితి కొంత మారొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News