రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో ఆసక్తికర సన్నివేశం!

Update: 2022-10-30 05:23 GMT
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం సాధించి పెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో జోడో యాత్ర ముగిసింది. ఇప్పుడు తెలంగాణలో యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్‌ జోడో యాత్రకు 50 రోజులు పూర్తయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో యాత్ర జరిగింది.

కాగా భారత్‌ జోడో యాత్రకు ప్రజలు వెల్లువలా తరలివస్తున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిరు వ్యాపారులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ రాహుల్‌ గాంధీతో కలసి పాదయాత్రలో మమేకమవుతున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో చోటా నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు సరేసరి.

కాగా తెలంగాణలో జరుగుతున్న తన పాదయాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ తనను కలవడానికి విద్యార్థులు, రైతులు, మేధావులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. మరోవైపు రాహుల్‌ పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వచ్చిందని చెబుతున్నారు.  

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల సమీపం గొల్లపల్లి నుంచి రాహుల్‌ అక్టోబర్‌ 30న ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. రాహుల్‌ గాంధీ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మధు యాష్కీ గౌడ్, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికీ ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున చిన్నారులు వచ్చారు. వారిని చూసిన ఉత్సాహంతో ఉన్నట్టుండి రాహుల్‌గాంధీ రన్నింగ్‌ రేసులాగా పరుగులు పెట్టారు. ఆయనతోపాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా పరుగులు దీశారు. ఇక వారిని పీసీపీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నాయకులు సైతం అనుసరిస్తూ పరుగు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఆదివారం ఉదయం 11 గంటలకు బాలానగర్‌ జంక్షన్‌ వద్దకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత ఇండస్‌ మార్టిన్‌ రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్‌ గాంధీతో చర్చించనున్నారు. అనంతరం రాహుల్‌ గాంధీ ఉపాధి హామీ రైతు కూలీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు.


Tags:    

Similar News