బీజేపీకి వాడేసి వదిలేసే బుద్ధి ఎంతో చెప్పిన పాతమిత్రుడు

Update: 2022-01-24 07:30 GMT
బీజేపీ -శివసేన మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఆ మాటకు వస్తే.. బీజేపీ వెంట నడిచేందుకు దేశంలోని రాజకీయ పార్టీలు ఏవీ ముందుకు రాని వేళలోనూ.. సేన వారికి దన్నుగా నిలిచింది. బీజేపీని ఒక అంటరాని.. అస్పృశ్య పార్టీగా దూరం పెట్టేసిన వేళలోనూ.. బీజేపీ విధానాల్ని బలంగా సమర్థించిన ఏకైక పార్టీ శివసేన. అలాంటి పార్టీతో అధికారాన్ని పంచుకోవటంలో తేడా వచ్చేయటం..

మారిన మిత్రుడి తీరుతో అలిసిపోయిన శివసేన.. కమలనాథులకు కటీఫ్ చెప్పటం.. మహారాష్ట్రలో కొత్త మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న బీజేపీ.. పరస్పర విరుద్ధ నేపథ్యం ఉన్న పార్టీల మధ్య పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటగా భావించటం తెలిసిందే.

అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా మూడు పార్టీల (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) సంకీర్ణ కూటమి సక్సెస్ ఫుల్ గా సర్కారును నడపటం బీజేపీని ఒక పట్టాన కొరుకుడుపడటం లేదని చెప్పాలి.

 తాజాగా శివసేనకు పంచ్ ఇవ్వాలన్నట్లుగా కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేనను సవాలు విసిరారు. దీనిపై తాజాగా మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రియాక్టు అయ్యారు.

అమిత్ షా సవాలును స్వీకరిస్తున్నట్లు చెప్పిన ఉద్దవ్ ఠాక్రే.. మరిన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దల నోటికి తాళాలు పడేలా.. ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..బీజేపీకి మిత్రపక్షంగా ఉండటం వల్ల పాతికేళ్ల విలువైన కాలాన్ని తాము వేస్టు చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రాలోనే కాదు.. రాష్ట్రానికి బయట కూడా సేన కార్యకలాపాల్ని విస్తరిస్తామని.. జాతీయ స్థాయికి ఎదుగుతామన్నారు.

తన కొత్త మిత్రులు ఎన్సీపీ.. కాంగ్రెస్ తో పొత్తును సమర్థించుకున్న శివసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుంది. మేం బీజేపీని వదిలేశాం కానీ హిందుత్వను కాదు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటాం.

కాంగ్రెస్.. ఎన్సీపీలు బీజేపీ మాదిరి కాదు. ఆ పార్టీలు వ్యవస్థల్ని గౌరవిస్తాయి. బీజేపీ ఎదుగుదలలో శివసేన లాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉంది. ఆ సమయంలో చాలా చోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవి కాదు’’ అంటూ పాత రోజుల్ని తన మాటలతో గుర్తు చేశారు.

హిందుత్వకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని.. అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదన్నారు. బీజేపీ అనుకూల వాద హిందుత్వ చేస్తుందన్న ఆయన.. అందుకు ఉదాహరణలు చెబుతూ.. ‘రాజకీయ అధికారం కోసమే బీజేపీ కశ్మీర్ లో పీడీపీతో.. బిహార్ లో జేడీయూతో పొత్తు పెట్టుకుంది.

సేన.. అకాలీదళ్ లాంటి పాత మిత్రులు బయటకు పోవటంతో ఎన్ డీఏ పరిధి తగ్గింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శల్ని తోసిపుచ్చిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే.. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.
Tags:    

Similar News