జై తెలంగాణ అన్న కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది

Update: 2020-02-03 05:03 GMT
తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డగా తెలంగాణ భవన్ ను చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం నుంచి విడిపోయి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం చేయటంలో తెలంగాణ భవన్ కీలకభూమిక పోషించటాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రంలోని మరే ప్రాంతం సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ భవన్ వరకూ వచ్చేసరికి ‘జై తెలంగాణ’ అన్న మాట వచ్చినంతనే.. రెట్టించిన ఉత్సాహం తో పెద్ద ఎత్తున నినాదాలు చేయటం కనిపిస్తుంది.

మరి.. అలాంటి తెలంగాణ భవన్ లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ నోటి వెంట జై తెలంగాణ అన్న మాటకు వచ్చిన రెస్పాన్స్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. శంషాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన పలువురు కౌన్సిలర్లు.. టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకం గా హాజరయ్యారు.

పార్టీలో చేరిన నేపథ్యంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. ఎప్పటిలానే తన ప్రసంగం పూర్తి అయిన తర్వాత కేటీఆర్ నోటి వెంట జై తెలంగాణ అంటూ నినాదం వచ్చింది. రోటీన్ గా ఇలా నినాదం వచ్చినంతనే.. అప్పటివరకూ ఉన్నా నిశ్శబ్దాన్ని విడిచి పెట్టి.. ఉత్సాహంతో జై తెలంగాణ అంటూ భారీగా రిప్లై ఇవ్వటం మామూలే. ఇందుకు భిన్నంగా తాజాగా మాత్రం.. కేటీఆర్ నోటి వెంట జై తెలంగాణ అన్న మాటకు రెస్పాన్స్ లేకపోవటమే కాదు.. ఎవరి నోటి నుంచి జై తెలంగాణ అన్న మాట రాక పోవటంతో కేటీఆర్ ఆశ్చర్యానికి గురయ్యారట.

దీంతో ఆయన.. జై తెలంగాణ అన్న నినాదాన్ని నేర్చుకోవాలంటూ కాస్తంత గట్టిగానే చెప్పటంతో.. అప్పటికి కానీ స్పందన లేదంటున్నారు. తెలంగాణ నినాదం ఢిల్లీ వరకూ చేరాలన్న కసితో నినాదాలు చేసే స్థాయి నుంచి జై తెలంగాణ అన్న నినాదాన్ని నేర్చుకోవాలంటూ కేటీఆర్ లాంటి ముఖ్యనేత పార్టీ నేతల తో.. అది కూడా తెలంగాణ భవన్ లో చెప్పే వరకూ వెళ్లటాన్ని ఏమనాలి? ఎలా చూడాలంటారు?


Tags:    

Similar News