సోమిరెడ్డికి ఆనందయ్య కౌంటర్.. ఏపీ సర్కార్ క్లారిటీ

Update: 2021-06-06 06:14 GMT
ఆనందయ్య ఆయుర్వేద కరోనా నివారణ మందు చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మందును వైసీపీ ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణ కాకరేపింది. దీనికి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఈ రాజకీయం ముదిరి పాకాన పడింది.

ఆనందయ్య మందు విషయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన విమర్శలు రాజకీయ వేడి పుట్టించాయి. తాజాగా ఈ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని కాకాని సవాల్ చేశారు.సోమిరెడ్డి ఆరోపణలపై ఆధారాలు ఉంటే నిరూపించాలని.. లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని కాకాని స్పష్టం చేశారు. ‘ఆయుర్వేదం’లో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉందని.. కోవిడ్ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారని తెలిపారు. సోమిరెడ్డి ఈ విషయలో దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇక సోమిరెడ్డి ఆనందయ్య మందు విషయంలో ఓ వెబ్ సైట్ ను వివాదంలోకి లాగారు. ఆ వెబ్ సైట్ లో ఆనందయ్య మందుకు ధరలు పెంచి దోచుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. దీనిపై తాజాగా ఆ వెబ్ సైట్ కు చెందిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి, సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తమ వెబ్ సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు.

ఇది పెద్ద దుమారం రేపడంతో తాజాగా ఈ ఆరోపణలపై ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య స్పందించారు. కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందును ఆన్ లైన్ లో అందిస్తామంటూ వైసీపీ నేతలు వెబ్ సైట్ సృష్టించారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆనందయ్య ఖండించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తోసిపుచ్చారు.

వెబ్ సైట్ కు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆనందయ్య తేల్చిచెప్పారు. సోమిరెడ్డి దీన్ని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సిన, మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.

ఇక ఓ వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందు ను పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్ సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది. ఇప్పటివరకు ఎలాంటి వెబ్ సైట్ కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఏపీ పరభుత్వం స్పష్టం చేసింది. పంపిణీపై ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
Tags:    

Similar News