నితీశ్‌ షాక్ః గెలిచిన బాహుబ‌లి

Update: 2015-11-09 07:25 GMT
బీహార్ అంటేనే గుండాయిజం - రౌడీయిజం చేసి ఆ త‌ర్వాత‌ రాజ‌కీయ నాయ‌కులుగా మార‌డానికి పెట్టింది పేరైన రాష్ర్టం. అలాంటి బీహార్ లో నీతివంత‌మైన రాజ‌కీయాల కోసం త‌నవంతు ప్ర‌య‌త్నం చేసిన బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ కు ఓ రౌడీ షాక్ ఇచ్చాడు.  ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో నితీశ్ పార్టీ అభ్య‌ర్థిపై గెలిచి త‌న స‌త్తా చాటాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ రౌడీ నితీశ్ పార్టీకి చెందిన మాజీ నాయ‌కుడే.

ఈ అసెంబ్లీ రౌడీ పేరు అనంత సింగ్ అలియాస్ బాహుబలి అలియ‌స్‌ చోటే సర్కార్. రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పుట్టి జేడీయూలో చేరాడు. 2005 - 2010లో జ‌రిగిన రాష్ర్ట ఎన్నిక‌ల్లో జేడీయూ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే పాత‌బుద్ధి పోనిచ్చుకోకుండా కిడ్నాప్ - హత్యలు - అత్యాచారాలకు పాల్ప‌డ్డాడు. ఎమ్మెల్యే అయినా కేసులు కామ‌నే. శిక్ష కూడా కామ‌నే. దీంతో అనంత్ సింగ్‌ జైలు పాలయ్యాడు.ఈ క్ర‌మంలోనే అతడిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. శిక్ష అవ‌లంభిస్తున్న సింగ్ జైలులో ఉంటున్న స‌మ‌యంలోనే ప్ర‌స్తుత ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి.

రాజ‌కీయాల రుచి మ‌రిగిన ప్రాణం క‌దా. అందుకే త‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన‌ మోకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి జైల్లో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఒక్క రోజు కూడా ప్ర‌చారం చేయ‌లేదు కానీ  54,005 ఓట్లు సాధించాడు. ఈయ‌న‌కు స‌మీప ప్ర‌త్య‌ర్థి ఎవ‌రంటే  జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్. నీర‌జ్‌ కు 35,657 ఓట్లు లభించాయి. మొత్తానికి 18,348 ఓట్ల మెజారిటీతో బాహుబ‌లి గెలిచి త‌న స‌త్తా చూపెట్టాడు. త‌ద్వారా బీహార్‌ లో జేడీయూ హ‌వా సాగుతుంటే ఆ అభ్య‌ర్థినే జైల్లో ఉండి మ‌రీ ఓడించిన ఘ‌నత దక్కించుకున్నాడు.
Tags:    

Similar News