సీఎం క‌న్నీళ్ల‌పై క‌మ‌ల‌నాథుల ఎట‌కారం!

Update: 2018-07-16 07:02 GMT
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి క‌న్నీళ్ల ఎపిసోడ్ రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారింది. బెంగ‌ళూరులో పార్టీ శ్రేణుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడే క్ర‌మంలో కుమార‌స్వామి భావోద్వేగానికి గురి కావ‌టం..తాను సీఎంగా సంతోషంగా లేనంటూ వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

స‌న్మానాలు.. వేడుక‌లు జ‌రుపుకోవ‌టానికి ఇది స‌రైన స‌మ‌యం కాదంటూ..తాను కాంగ్రెస్  కూట‌మితో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నోరు విప్పారు. మా సోద‌రుడు సీఎం అయ్యారంటూ మీరంతా సంబ‌ర‌ప‌డుతున్నారు. నేను మాత్రం సంతోషంగా లేను. లోకాన్ని ర‌క్షించ‌టానికి శివుడు త‌న కంఠంలో విషాన్ని దాచుకున్న‌ట్లుగా తాను  విషం తాగుతున్న‌ట్లుగా చెప్పారు.

ఎన్నిక‌ల వేళ తాను ఇచ్చిన హామీల్ని అమ‌లు చేస్తాన‌ని చెప్ప‌టంతో పాటు.. ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన ప్రేమాభిమానాల‌పై ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు.  ఈ క్ర‌మంలోకంట‌త‌డి పెట్టిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ కాస్తంత అస‌హ‌నానికి గురైన‌ప్ప‌టికీ.. బ్యాలెన్స్ మిస్ కాకుండా సంయమ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తూ స‌ర్ది చెప్పే రీతిలో వ్యాఖ్య‌లు చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క‌ర్ణాట‌క ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీ మాత్రం ఈ వ్య‌వ‌హారాన్ని ఎట‌కారం చేసుకుంది.

కుమార‌స్వామి కంట‌త‌డి పెట్టిన వైనంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. నట దిగ్గ‌జం అంటూ ఎద్దేవా చేయ‌ట‌మే కాదు.. అండ్ ది బెస్ట్ యాక్టింగ్ అవార్డ్ గోస్ టూ.. అంటూ ట్విట్ట‌ర్లో ట్వీట్ చేయ‌టం రాజ‌కీయంగా మ‌రింత వేడెక్కేలా చేసింది. కుమార‌స్వామి త‌న అద్బుత‌మైన న‌ట‌నా చాతుర్యంతో ప్ర‌జ‌ల్ని నిత్యం త‌ప్పుదారి ప‌ట్టిస్తుంటార‌ని.. మ‌రోసారి అదే ప‌ని చేశారని పేర్కొంటూ సీఎం కంట‌త‌డి పెట్టిన వీడియోను ట్విట్ట‌ర్ లో జ‌త చేశారు. సీఎం కంట‌త‌డికి త‌న‌దైన రీతిలో ఎట‌కారం పంచ్ ఇచ్చిన బీజేపీపై జేడీయూ నేత‌లు మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News