ఆంధ్రాకు.. తెలంగాణకు తేడా ఉందోయ్

Update: 2016-07-20 04:52 GMT
తెలంగాణకు.. ఆంధ్రాకు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి? అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఈ రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం భారీగా కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను సుదీర్ఘంగా నడిపిన ఉద్యమ సమయంలో తరచూ ఒక విషయాన్ని ప్రస్తావించేవారు. పేరుకు తెలుగు వాళ్లే అయినా.. తెలంగాణ.. సీమాంధ్రుల మధ్య వ్యత్యాసం బోలెండత అని. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాలుగా చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు ఏపీ సర్కారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఈ రెండు అంశాల మీద ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి మైండ్ సెట్ లో ఎంత తేడా అన్న భావన కలగటం ఖాయం.

రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు చేపడుతున్న ప్రాజెక్టులపై విపక్షాలు విరుచుకుపడటం మామూలే. అయితే.. మేదావులు.. ప్రజాసంఘాల విషయంలోనే వచ్చే తిప్పలు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటం కనిపిస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ సర్కారు అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానాన్ని విపక్షం వ్యతిరేకిస్తోంది. కానీ.. మేధావులు.. ప్రజా సంఘాల నుంచి నిర్మాణాత్మకమైన విమర్శలు.. స్పందన లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.

అదే సమయంలో తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుందనే చెప్పాలి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కావొచ్చు.. పాలమూరు ఎత్తిపోతుల పథకం కావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. రెండేళ్ల నుంచి కామ్ గా ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం సైతం గొంతు విప్పటం.. పలువురు మేధావులు రోడ్ల మీదకురావటం.. చర్చాకార్యక్రమాల్ని చేపట్టటం స్పష్టంగా కనిపిస్తుంది. వీరికి తోడు రిటైర్డ్ ఇరిగేషన్ నిపుణులు సైతం బయటకు వచ్చి.. ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్ని బలంగా తప్పు పట్టటమే కాదు.. వారు ఎక్కడ.. ఏ పాయింట్ లో తప్పు చేస్తున్నారన్నది ఉదాహరణలతో సహా చెబుతున్న వైనం చూసినప్పుడు.. పేరుకు తెలుగుప్రజలే అయినా.. ఆలోచనా విధానం.. ఏదైనా అంశంపై స్పందించే తీరులో ఉన్న వ్యత్యాసం ఇట్టే కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News