బాబు పై పడనున్న కేసీఆర్ దెబ్బ

Update: 2015-10-24 06:02 GMT
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నన్ని వెసులుబాట్లు విభజన తర్వాత ఉండవన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని సూపర్ హిట్ అయ్యిందని భావిస్తున్న బాబు అండ్ కో మాంచి ఉత్సాహం మీద ఉంది. తమకు తిరుగులేదన్నట్లుగా ఉన్న చంద్రబాబు సర్కారు తాజాగా తీసుకున్న ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ఏపీ ప్రజలకు షాకింగ్ గా మారింది. అమరావతి శంకుస్థాపన మహోత్సవ మత్తు నుంచి ఇంకా బయటకు రాకముందే.. భారీగా వడ్డించేసిన బాబు వైఖరి ఏపీ ప్రజలకు ఇబ్బందేనని చెప్పక తప్పదు.

ఛార్జీల పెంపు సందర్భంగా చంద్రబాబు కీలకమైన విషయాన్ని మర్చిపోయారన్న మాట బలంగా వినిపిస్తోంది. తాను ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రం కానీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోకుంటే.. ఏపీ.. తెలంగాణ ఆర్టీసీ మధ్య ఛార్జీల ప్రభావం ఏపీ ప్రజలపై ప్రత్యక్షంగా పడటంతో పాటు.. ఏపీ సర్కారు మీద మరింత వ్యతిరేకత పెరుగుతుందని చెబుతున్నారు.

పదేళ్ల ఉమ్మడి రాజధాని పుణ్యమా అని.. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రతి జిల్లా కేంద్రానికి బస్సు సర్వీసుల్ని తెలంగాణ సర్కారు నడిపిస్తోంది. అంటే.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే బస్సుల్లో ఛార్జీలు తక్కువ.. అదే సమయంలో ఏపీ బస్సుల్లో చార్జీలు ఎక్కువగా పడనుంది.

ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కితే రూ.213 ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. అదే.. ఏపీ ఆర్టీసీ బస్సు ఎక్కితే రూ.235 చెల్లించాల్సిందే. అదే విధంగా డీలక్స్ లో తెలంగాణ ఆర్టీసీ రూ.239 వసూలు చేస్తే.. ఏపీ ఆర్టీసీ రూ.264 ముక్కు పిండనుంది. ఇక.. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఛార్జీ రూ.282 ఉంటే.. ఏపీ ఆర్టీసీ బస్సు రేటు రూ.313 గా ఉండనుంది. ఈ వ్యత్యాసంతో బాబు తమపై భారీగా భారాన్ని మోపుతున్నారన్న భావన కలగటం ఖాయం. అదే సమయంలో తెలంగాణ సీఎంపై సానుకూలత మరింత పెరిగే వీలుంటుందని చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఛార్జీల పెంపు రాష్ట్రం మొత్తానికి వర్తించేది. విభజన నేపథ్యంలో ఏపీలో ఉండే తెలుగు వారిపై చార్జీల పెంపు మోత పడుతుండగా.. తెలంగాణలో అందకు భిన్నమైన పరిస్థితి. దీంతో.. బాబు సర్కారుపై కేసీఆర్ సర్కారు దెబ్బ పడటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రతి విషయంలోనూ పోలిక పెట్టి చూడటం అలవాటైన నేపథ్యంలో.. ప్రజలపై నేరుగా భారం పడే ఛార్జీల పెంపు లాంటి అంశం బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు. ఊపు.. ఉత్సాహం పొంగిపొర్లుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలన్న విషయం బాబు ఎందుకు మిస్ అవుతున్నారు?
Tags:    

Similar News