వానలు కోసం అక్టోబరు వరకు ఆగాల్సిందేనా?

Update: 2015-07-13 00:03 GMT
అనుకున్న దాని కంటే ముందుగా పలుకరించిన వానలతో చాలామంది మురిసిపోయారు. అన్నదాతల ఆనందానికి అయితే హద్దులే లేవు. ముందు వెనుకా చూడకుండా చాలామంది హడావుడిగా దుక్కి దున్ని.. నాట్లు వేసేసిన పరిస్థితి.

ముందు మురిపించిన వాన.. తర్వాత జాడ లేకుండా పోయింది. నైరుతి మీద ఎన్నోఆశలు పెట్టుకున్న వారిని నిరాశకు గురి చేస్తూ.. అవి తమ దారిన తాము వెళ్లిపోయాయి. నైరుతితో దక్షిణాది కంటే ఉత్తరాదిన విపరీతంగా వానలు పడుతున్న పరిస్థితి. దక్షిణాదికి నిరాశ మిగిల్చిన నైరుతి.. ఉత్తరాదిని మాత్రం భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక.. నైరుతి తన దారిన తాను వెళ్లిపోవటంతో రెండో వేసవి మొదలైనట్లుగా వాతావరణం మారింది. హిమాలయాల వరకు వెళ్లిన నైరుతి రుతుపవనాల ద్రోణి కిందకు రానంటే రానంటూ మొండికేస్తోంది. దీంతో.. వాన జాడ లేని పరిస్థితి.

మూడు రోజులు మురిపించిన వాన.. మళ్లీ ఎప్పుడంటే.. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న అంచనా వింటే ఊసురుమనిపించక మానదు. వర్షాలతో జూన్.. జూలై.. కాస్తంత ఆగస్టులో తడిచి ముద్దయ్యే దానికి బదులుగా.. సెప్టెంబరు వరకు వాన జాడ ఉండదని తేల్చేశారు.

అక్టోబరు మొదట్లో వచ్చే ఈశాన్య రుతుపవనాల వరకూ వర్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు. అక్టోబరులో వచ్చే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడతాయని.. అది కూడా కోస్తా కంటే కూడా తెలంగాణ..రాయలసీమలోనే ఎక్కువ పడే వీలుందని చెబుతున్నారు. వర్షాల జాడ లేని నేపథ్యంలో.. ఉడుకుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజల కంటే కూడా.. హడావుడిగా పంటలేసిన అన్నదాత పరిస్థితే అగమ్యగోచరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News