అదేంది బాబు.. నిమిషానికి అంత ఖ‌ర్చా?

Update: 2017-03-29 08:23 GMT
అసెంబ్లీ నిర్వ‌హ‌ణ కోసం ఏపీ ఆర్థిక మంత్రి చెప్పిన లెక్క వింటే నోట మాట రాని ప‌రిస్థితి. న‌గ‌రానికి దూరంగా.. పంట పొలాల మ‌ధ్య‌.. మంత్రులు.. శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ల‌కు కేటాయించిన గ‌దుల‌కు బాత్రూంల్లేని భ‌వ‌నంలో నిర్వ‌హించే అసెంబ్లీ కోసం నిమిషానికి అయ్యే ఖ‌ర్చు వింటే నోట మాట రాదంతే. అసెంబ్లీ.. శాస‌న మండ‌లిలు నిర్వ‌హించాలంటూ నిమిషానికి రూ.10,446 ఖ‌ర్చు అవుతుంద‌ట‌. ఇందులో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌కు రూ.7వేలకు పైనే ఖ‌ర్చు అవుతుంటే.. మిగిలిన మొత్తం శాస‌న‌మండ‌లికి ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క తేల్చారు.

ఈ లెక్క‌న ఒక రోజు ఉభ‌య‌స‌భ‌ల్ని నిర్వ‌హిస్తే రూ.31,33,849 ఖ‌ర్చు అవుతుంద‌ని.. ఏడాదిలో స‌భా కార్య‌క్ర‌మాల కోసం రూ.114కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇన్ని వంద‌ల కోట్లు అచ్చంగా.. ప్ర‌జ‌ల ముక్కుపిండి వ‌సూలు చేసే ప‌న్ను మొత్త‌మే. మ‌రి.. జ‌నాల డ‌బ్బుతో స‌భ‌లు నిర్వ‌హించుకునే స‌భ‌లో.. అధికార‌ప‌క్ష నేత అదే ప‌నిగా.. గంట‌ల కొద్దీ స‌మ‌యం చెప్పిందే చెప్పి.. చెప్పి ల‌క్ష‌లాది రూపాయిలు ఖ‌ర్చు చేసే క‌న్నా.. కాస్త మాట‌ల్ని త‌గ్గిస్తే మంచిదేమో.

విప‌క్షంపై ఒంటికాలిపై విరుచుకుప‌డుతూ.. తొండి వాద‌న‌ల్ని వినిపించే అధికార‌ప‌క్షం.. విప‌క్షం చేసే విమ‌ర్శ‌ల్ని హుందాగా స్వీక‌రించి.. త‌ప్పులు చేస్తే స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ద్ర‌వ్య వినిమ‌య బిల్లు ఆమోదం కోసం చ‌ర్చ‌కు వీలు లేకుండా విప‌క్షం వ్య‌వ‌హ‌రించింద‌ని విరుచుకుప‌డే ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల‌.. లీకేజీ వ్య‌వ‌హారంపై 30వ తేదీన ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని చెప్పి.. అద‌రాబాద‌రాగా ఎందుకు చెప్పిన‌ట్లు?

ముందుగా ప్ర‌క‌టించిన దాని కంటే లీకేజీ వ్య‌వ‌హారం మీద వివ‌ర‌ణ చెప్పేస్తే వ‌చ్చే న‌ష్టం ఏమిట‌న్న ప్ర‌శ్న కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు వేయొచ్చు. ఒక‌సారి ప్ర‌క‌ట‌న చేసి.. స‌భ‌లో విప‌క్షం లేని వేళ‌లో.. కీల‌క అంశంపై వివ‌ర‌ణ ఇచ్చేసి..స‌బ్జెక్ట్ క్లోజ్ అయిన‌ట్లుగా ప్ర‌క‌టించ‌టంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. ఇదే విష‌యం మీద అసెంబ్లీలో విప‌క్షాలు నిర‌స‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంది. అంటే.. స‌భా స‌మ‌యాన్ని వృధా చేయ‌టానికి అవ‌స‌ర‌మైన ప‌రిస్థితుల్ని అధికార‌ప‌క్ష‌మే స్వ‌యంగా చేస్తుంద‌న్న విష‌యాన్ని ఇక్క‌డ గుర్తించాల్సిందే. స‌భ‌ను స‌జావుగా న‌డ‌ప‌టానికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అధికార‌ప‌క్షం.. రెచ్చ‌గొట్టే ధోర‌ణిలోనూ.. త‌ప్పుల్ని క‌ప్పిపుచ్చుకునేలా వ్య‌వ‌హ‌రించ‌టం కూడా ప్ర‌జాధ‌నాన్నివృధా అవుతుంద‌న్న విష‌యాన్ని లెక్క‌లు చెప్పే య‌న‌మ‌ల లాంటి వారు గుర్తిస్తే మంచిది. అయినా.. వ‌స‌తులు లేని అసెంబ్లీ భ‌వ‌నంలో నిర్వ‌హించే స‌మావేశాల‌కు మ‌రీ ఇంత ఖ‌ర్చు అంటే వినే వారికి మ‌న‌సు ఒప్ప‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News