బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏపీ అసెంబ్లీ ట‌వ‌ర్ డిజైన్‌

Update: 2017-04-25 05:52 GMT
చేతిలో డ‌బ్బుల్లేవ్‌. నిత్యం.. సాయం కోసం ఎదురుచూపులే. ఏ రోజు ఎవ‌రొచ్చి సాయం చేస్తారా? అన్న వెతుకులాట‌లే. ఇవ‌న్నీ ఒక‌వైపు.. మ‌రోవైపు బ‌డాయి క‌బుర్లు.. ఆడంబ‌రాలు.. అద్భుతాల ఆవిష్క‌ర‌ణ‌లంటూ గొప్ప‌ల‌తో బండి న‌డిచిపోతోంది. మూడేళ్ల నుంచి ఏపీని ఎంతో దూసుకెళ్లేలా చేస్తాన‌ని చెప్పిన మాట‌ల‌కు.. తీరా ఇప్పుడున్న ప‌రిస్థితికి మ‌ధ్య అంతరం ఎంతో అంద‌రికి తెలిసిందే.

మొన్న‌టికి మొన్న ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. రాష్ట్ర దీన ప‌రిస్థితిని చెప్పి.. సాయం చేసి పుణ్యం క‌ట్టుకోవాలంటూ చెప్పుకున్నా.. ఎలాంటి భ‌రోసా ల‌భించ‌ని వైనం తెలిసిందే. స‌రిగ్గా ఇలాంటి వేళ‌లోనే.. ఏపీలో నిర్మించే శాశ్విత అసెంబ్లీ.. శాస‌న మండ‌లి భ‌వ‌నం ఎలా ఉంటుందో తెలుసా అంటూ ఒక డిజైన్‌ ను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

బంగారు క‌ల‌ల్ని యానిమేటెడ్ బొమ్మ‌ల‌తో చూపిస్తున్న ఏపీ స‌ర్కారు.. తాజాగా ఆ త‌ర‌హా బొమ్మ‌ను చూపించేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించే భారీ అసెంబ్లీ.. మండ‌లి ఆకృతుల్ని బ్రిట‌న్‌ కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ అండ్ పార్ట‌న్స్ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తాము సిద్ధం చేసిన ఒక  ఆకృతిని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. మూడు.. లేదంటే నాలుగు భ‌వ‌నాలు.. వాటిపైన చ‌తుర‌స్రాకారపు క‌ప్పు.. దాని మీద అత్యంత ఎత్తైన ట‌వ‌ర్ వ‌చ్చేలా రూపొందించిన డిజైన్‌ ను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. భ‌వ‌నం ఎత్తు ట‌వ‌ర్ తో స‌హా 530 అడుగులు ఉంటుంద‌ని చెబుతున్నారు. సుమారు 50 అంత‌స్తుల ఎత్తులో ఉండే ఈ డిజైన్ అమ‌రావ‌తి భూముల‌కు సూట్ అవుతుందా? అన్న‌ది సందేహం. గ‌తంలో చెప్పిన దాని ప్ర‌కారం.. అమ‌రావ‌తిలో ఎత్తు ఎత్తున నిర్మాణాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పారు. దీనికి భిన్నంగా అసెంబ్లీ భ‌వ‌నాన్ని భారీ ఎత్తులో నిర్మించేలా డిజైన్‌ను సిద్ధం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఈ మోడ‌ల్ ప‌లువురిని ఆక‌ర్షిస్తోంద‌ని చెబుతున్న ఏపీ మంత్రులు.. దీనికి మించిన రీతిలో మ‌రో రెండు డిజైన్ల‌ను సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. బ్రిట‌న్ సంస్థ త‌యారు చేసిన మ‌రో రెండు డిజైన్ల‌ను వ‌చ్చే నెల 10.. 11 తేదీల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. అనంత‌రం.. మూడు డిజైన్ల‌లో ఒక దానిని ఫైన‌ల్ చేస్తార‌ని చెబుతున్నారు. డిజైన్ల ముచ్చ‌ట బాగానే ఉన్నా.. ఇంత భారీ భ‌వంతుల నిర్మాణం అవ‌స‌ర‌మా? అన్న‌ది ప్ర‌శ్న ఎందుకంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకు క‌ట‌క‌ట‌లాడేస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. భారీ డిజైన్ల ఆడంబ‌రం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఆర్థిక ప‌రిస్థితి బాగు ప‌డిన త‌ర్వాత‌.. నిర్మాణాల మీద ఫోక‌స్ చేయాల్సింది పోయి.. ఇప్పుడేదో ముంచుకొస్తున్న‌ట్లుగా హ‌డావుడిగా డిజైన్ల మీద డిజైన్ల‌ను త‌యారు చేయ‌టం ఏమిటో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News