ఏపీ చంద్రబాబు చేజారుతుందా..?

Update: 2017-12-23 04:45 GMT
ఏపీలో బీజేపీ ఎంత? ఇదేం ప్రశ్న.. ఇక్కడేదో చంద్రబాబుతో కలిసి ప్రభుత్వంలో ఉంది కాబట్టి అంతోఇంతో నిత్యం ఆ పార్టీ పేరు వినిపిస్తోంది కానీ, ఇక్కడేం బీజేపీ అనుకుంటున్నారా? అయినా... చంద్రబాబు ముందు ఆ పార్టీ ఏం చేయలేదని అనుకుంటున్నారా... అయితే, మీరు తప్పులో కాలేసినట్లు. బీజేపీకి బలగం తక్కువే ఉండొచ్చు కానీ బలం మాత్రం తక్కువేమీ లేదని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ డామినేట్ చేస్తున్న అంశాల్లో చంద్రబాబు కూడా  వేలు పెట్టడానికి భయపడేలా ఆ పార్టీ చక్రం తిప్పుతోందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆలయాల విషయంలో పూర్తిగా బీజేపీ ఇష్టమే సాగుతోందని... చివరకు తిరుమల కొండపైనా కేంద్రమే కనిపిస్తోంది కానీ చంద్రబాబు - టీడీపీ నేతల మాటకు ప్రాధాన్యం తగ్గిపోయిందని తెలుస్తోంది. దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు కూడా కేంద్రం అభిమతానికి తగ్గట్లుగానే తన శాఖను మలుస్తున్నారని వినిపిస్తోంది. అయితే... కొన్ని విషయాల్లో ఇది హిందూ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతుందన్న సంతోషం కూడా చాలామంది నుంచి వ్యక్తమవుతోంది.
    
అయితే.. టీడీపీ నేతల్లో చాలామంది తిరుమల విషయంలో జరుగుతున్న రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పాలకమండలిని నియమించకపోవడంతో ఆ పదవులును ఆశించినవారు కక్కలేక మింగలేక ఉంటున్నారు. అయితే.. చంద్రబాబు కేంద్రాన్ని కాదనలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. నిజానికి టీటీడీ ఛైర్మన్ గా యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ పేరు ఖరారైపోయింది. కానీ.. బోర్డులో ఎవరెవరు ఉండాలనే విషయంలో కేంద్రంలోని మంత్రులు  జైట్లీ - గడ్కరీ - ఉమా భారతిలు కొన్ని సిఫారసులు చేశారట. దీంతో చంద్రబాబుకు ఏమీ పాలుపోని పరిస్థితి. జైట్లీని కాదంటే నిధులు ఆగిపోతాయి.. గడ్కరీకి నో చెప్తే పోలవరం డోలాయమానం.. ఇక ఉమాభారతితో పెట్టుకునే సాహసం ఎవరూ చేయరు. దీంతో చంద్రబాబు వారి కేండిడేట్లను నియమించలేక - నో చెప్పలేక ఏకంగా నియామకాలనే ఆపేశారంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈవోగా ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యక్తిని నియమించారు.
    
మరోవైపు ఏపీ దేవాదాయ శాఖ కూడా ఎవరూ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు - కార్యక్రమాలు చేపట్టవద్దని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టుకు ఆదేశాలు జారీ చేసింది. జ‌వ‌న‌రి 1న ఇలా వేడుక‌లు జ‌ర‌పుకోవ‌డం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొన‌డం విశేషం. దేవాల‌యాల‌ను ప్ర‌త్యేకంగా అలంకరించటం వంటివి చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ ఆదేశాలు పంపించింది. నిజానికి దీనిపై ప్రభుత్వంలో చర్చ కూడా జరిగిందట... కానీ, చంద్రబాబు దీనిపై ఏమీ అనలేకపోయారని తెలుస్తోంది.
Tags:    

Similar News