బీజేపీ మాట‌!... బాబు మోస్ట్ డేంజ‌ర‌స్!

Update: 2017-10-11 04:19 GMT
టీడీపీ అదినేత‌గానే కాకుండా ఆ పార్టీ అధికారంలో ఉన్న న‌వ్యాంధ్ర‌కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నారా చంద్ర‌బాబునాయుడు... రాజ‌కీయాల్లో త‌న‌ను తాను అప‌ర చాణ‌క్యుడిగా చెబుతూ ఉంటారన్న వాద‌న ఉంది. ఈ త‌ర‌హా చాతుర్యాన్ని ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ వాడుతూ ఉంటార‌న్న విష‌యంలోనూ ఏ ఒక్క‌రికీ అనుమానం లేద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ప‌రిస్థితుల‌ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌... ఆ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయాలా?  లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలా? అన్న విష‌యంపై చంద్ర‌బాబు కాస్తంత ప‌క్కాగానే ప్లాన్ చేస్తార‌ట‌. అందుకేనేమో.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భంజ‌నం ముందు తాను ఎక్క‌డ కొట్టుకుపోతానోన‌న్న భ‌యంతోనే బీజేపీతో ఉన్న మైత్రిని కొన‌సాగిస్తూనే కొత్త‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సాయం కూడా ఆయ‌న తీసుకున్నారు. అటు బీజేపీ - ఇటు ప‌వ‌న్ సాయంతో ఎలాగోలా గ‌ట్టెక్కిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల నాడు ఏ త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేస్తార‌న్న విష‌యం ఇటు ఇత‌ర పార్టీల‌తో పాటు అటు ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌కు కూడా అంతు చిక్క‌ని అంశ‌మేన‌ని చెప్పాలి.

అయినా ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర మేర స‌మ‌య‌ముండ‌గా... ఇప్పుడు ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అమ‌లు చేయ‌బోయే వ్యూహం ఎందుక‌నేగా మీ ప్ర‌శ్న‌? ఈ ప్ర‌శ్న కామ‌నే అనుకున్నా... ఆయ‌న‌తో చాలా ఏళ్లుగా జ‌ట్టు క‌ట్టి - గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ టీడీపీతోనే క‌లిసి బ‌రిలోకి దిగిన జాతీయ పార్టీకి బీజేపీకి మాత్రం ఈ విష‌యం ఇప్పుడు అంతుచిక్క‌ని విష‌యంగానే ప‌రిణ‌మించిందట‌. మిత్ర‌ప‌క్షానికి చెందిన అధినేత‌గా... కేంద్రంలో త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వంలో భాగం తీసుకుని, రాష్ట్ర కేబినెట్‌ లో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు చోటిచ్చిన చంద్ర‌బాబుపై బీజేపీకి ఎందుకు అనుమానాలు వ‌చ్చాయ‌న్న విష‌యానికి వ‌స్తే... నిన్న గుంటూరు వేదిక‌గా జ‌రిగిన బీజేపీ రాష్ట్రస్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో టీడీపీ వైఖ‌రి - ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు వైఖ‌రిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింద‌ట‌. స‌ద‌రు చ‌ర్చ‌ను లేవ‌నెత్తిన బీజేపీ నేత‌లు... ఏ రాయ‌ల‌సీమ‌కో - ఉత్త‌రాంధ్ర‌కో చెందిన వారు ఎంత‌మాత్రం కాదు. త‌న‌కు బాగా బ‌ల‌మున్న జిల్లాలుగా చంద్ర‌బాబు పేర్కొంటున్న కృష్ణా - గుంటూరు - ఉభ‌య గోదావరి జిల్లాల‌కు చెందిన బీజేపీ కీల‌క నేత‌నే ఈ చ‌ర్చ‌కు తెర తీశార‌ట‌.

అస‌లు బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఏళ్లుగా ఇరు పార్టీల మ‌ధ్య మైత్రి కొన‌సాగుతున్నా... టీడీపీ నేత‌లు త‌మ‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు వాపోయార‌ట‌. కృష్ణా జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఈ చ‌ర్చ‌కు తెర తీయ‌గా... గుంటూరు జిల్లాకు చెందిన మ‌రో కీల‌క నేత ఆ వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికార‌ట‌. ఇదే అద‌ను కోసం ఎదురుచూస్తున్న ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలకు చెందిన నేత‌లు కూడా వీరితో గ‌ళం క‌లిపార‌ట‌. అప్ప‌టిదాకా సాఫీగా సాగిపోతోంద‌నుకుంటున్న స‌మావేశాలు... ఈ చ‌ర్చ ప్రారంభం కాగానే కాస్తంత వాడీవేడీగానే మారిపోయాయ‌ట‌. అయినా మిత్ర‌ప‌క్షానికి చెందిన అధినేత‌గా చంద్ర‌బాబును అనుమానించాల్సిన అవ‌స‌రం ఏమిటని ప్ర‌శ్నించిన బీజేపీ ఏపీ చీఫ్ కంభంపాటి హ‌రిబాబుకు... వారంతా క‌లిసి త‌మ బాధ‌ల‌ను ఏక‌రువు పెట్టార‌ని స‌మాచారం. మిత్ర‌ప‌క్షానికి చెందిన నేత‌లుగా ఏ ప‌ని కోసం వెళ్లినా... బాబు స‌ర్కారు క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌నీసం విప‌క్షం వైసీపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు - ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జీల‌కు ఇస్తున్నంత ప్రాధాన్యం కూడా త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌ని వారు స‌భాముఖంగానే ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును న‌మ్ముకుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని కూడా వారు హెచ్చ‌రించారు. చంద్రబాబు వ్య‌వ‌హార స‌ర‌ళి చూస్తుంటే... వ‌చ్చే ఎన్నికల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా వారు డేంజ‌ర్ బెల్స్ మోగించార‌ట‌.

ఈ త‌ర‌హా కొత్త వాద‌న తెర‌మీదకు వ‌చ్చేస‌రికి... కంభంపాటి కూడా వారి వాద‌న‌ను సాంతం విందామ‌న్న కోణంలో సైలెంట్ అయిపోగా... చంద్రబాబు వ్యూహాల‌కు సంబంధించిన మొత్తం వ్య‌వ‌హారాన్ని కృష్ణా జిల్లాకు చెందిన ఆ బీజేపీ నేత కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశార‌ట‌. వ్య‌వ‌హార స‌ర‌ళి ప‌రంగా చూస్తే... త‌మ‌కు వామ‌ప‌క్షాల కంటే కూడా చంద్ర‌బాబే డేంజ‌ర‌స్‌ గా ప‌రిణ‌మించే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని ఆ నేత కాస్తంత గ‌ట్టిగానే చెప్పార‌ట‌. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని చంద్ర‌బాబు చెబితే... మ‌న ప‌రిస్థితి ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా ప్ర‌మాదాలు ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసుకోక‌పోతే... చాలా క‌ష్ట‌మ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చార‌ట‌. బీజేపీ ప్ర‌జా ప్ర‌తినిధులు, కీల‌క నేత‌ల ప‌ట్ల చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతోనే త‌మ‌కు ఈ అనుమానాలు వ‌చ్చాయ‌ని కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల‌ను సోదాహ‌ర‌ణంగా వివ‌రించార‌ట‌. వెర‌సి చంద్ర‌బాబు నిజ నైజం ఇదేనంటూ నేత‌లు చేసిన వాద‌న‌ను సాంతంగా విన్న కంభంపాటి... విష‌యాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ‌దామ‌ని చెప్పార‌ట‌.
Tags:    

Similar News