పిరాయింపు నేత‌ల‌కు కొత్త ట్విస్ట్

Update: 2016-11-14 22:30 GMT
వ‌ల‌స ప‌క్షుల‌కు స‌మ‌యం క‌లిసి రావ‌డం లేదు. రాష్టవ్రిభజన నిర్ణయంతో కుదేలైన కాంగ్రెస్‌ పార్టీని వీడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన‌ కొందరు నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అలా చేరిన నేతల్లో పేరుమోసిన వారు ఉండటం విశేషం. కానీ ఆ నేతలు సైతం ఇప్పుడు బిజెపిలో పూర్తిస్థాయిలో ఇమడలేక వెంటనే బయటకు రాలేకపోతున్న ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.  రాజకీయ భవిష్యత్తుకోసం బిజెపిలో చేరిన కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఇప్పుడు మరోసారి తమ భవిష్యత్తుపై బెంగపెట్టుకొన్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెంటిమెంటుగా బలపడుతున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకొన్న కరెన్సీ నోట్ల రద్దుతో వారిలో గుబ్బులు పుట్టుకొంది. మున్ముందు తమ భవిష్యత్తు ఏదీ అని ఈ నేతలు దారులు వెతుక్కొంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన పరిణామాలు విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని రాజకీయ పక్షాల భవిష్యత్తును తారుమారుచేస్తే కొన్ని రాజకీయ జాతక చక్రం కూడా ఆమోఘంగా మారింది. ఈ రాష్ట్ర విభజనవల్ల ఏపీలో బీజేపీ కూడా కొంతమెరుగ్గుపడిందన్న ప్రచారం సాగింది. ఈ ప్రచారంవల్లే నాడు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తీసుకొన్న రాష్టవ్రిభజన నిర్ణయం వల్ల ఆ పార్టీని వీడిన కొందరు సీనియర్‌ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. వీరిలో కేంద్రమాజీ మంత్రులు పురందేశ్వరీ - కావూరిసాంబశివరావు - మరో సీనియర్‌ నేత కన్నా లక్ష్మినారాయణ  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - మాజీ మంత్రి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి - ఇలా పలువురు నేతలు ఉన్నారు. అయితే  ఏ రాజకీయ భవిష్యత్తు కోసమైతే వారు బిజెపిలో చేరారో ఆ దిశగా వారి రాజకీయ జీవితం మలుపుతిరగడంలేదు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఈ నేతలకు బీజేపీ నాయకత్వం పార్టీలో స్థానం ఇచ్చినా పార్టీ కీలక పదవుల్లో మాత్రం తమ పాత నేతలకే కట్టుబెడుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగువెలిగి రాష్టర్రాజకీయాలను శాసించే స్థాయిలో కొనసాగిన ఈ నేతలు బీజేపీలో చేరినా వారి దశమాత్రం ప్రస్తుతం అగమ్యగోచరంగానే ఉంది.  ఇప్పటికే వలసవెళ్లిన ఈ నేతలకు కమలపార్టీలో అనుకొన్న మేర ప్రాధాన్యత లభించడంలేదని సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఈ వలసవచ్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా తొలి ప్రాధాన్యత మాత్రం తమ మాతృసంస్థ వాసనలు ఉన్నవారికే అత్యధికంగా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో తమ ఇమేజ్‌ ను కేవలం పార్టీ బలోపేతం కోసం వాడుకొంటోందే గానీ తమకు సముచిత ప్రాధాన్యత మాత్రం పార్టీ ఇవ్వడంలేదని బీజేపీ జాతీయ నాయకత్వంపైనా ఈ వలస పక్షులు అంతర్గతంగా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధినాయకత్వం వలసవచ్చిన ఈ నేతలకు పదవుల పరంగా, ప్రాధాన్యత పరంగా మాత్రం పక్కనెడుతోందన్న ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని తమ సన్నిహితుల వద్ద వ్యక్తంచేస్తూ ఈ వలస వచ్చిన నేతలు రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.

ఏపీకి ప్రత్యేకహోదా అంశం, పెద్ద నోట్ల రద్దు పెద్ద సంకటంగా మారుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితికి బీజేపీ నాయకత్వమే కారణంగా ఈ వలస వచ్చిన నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అని చెప్పుకోవడానికే తప్పా ఆ పార్టీలో కొనసాగినా తమకు సొంత ఇలాకలోనే పనులు కావడంలేదని, పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా కాదని చెప్పి ఆర్థిక ప్యాకేజీకే కేంద్రం మొగ్గుచూపడం, కరెన్సీ రద్దు వంటి వాటివల్ల మరింత ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వలసవచ్చిన నేతలు కొందరు తమ సన్నిహితులవద్ద మనోవేదనను వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. బీజేపీ నాయకత్వం పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వకపోగా హోదాపై దాటవేయడం కూడా తమ ఈ పరిస్థితికి వారు కారణమవుతున్నారని వలసవచ్చిన నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ నేతలు కూడా బీజేపీలో కొనసాగే విషయంలో పునరాలోచనల్లో పడినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News