‘యాంటీ బాబు స్లోగన్’ జోరు పెరిగేనా?

Update: 2017-12-19 23:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక విలక్షణమైన పరిస్థితి ఉంది. అక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలే. కలిసి అధికారాన్ని పంచుకునే పాలన సాగిస్తున్నాయి. కానీ భాజపాలో ఒక వర్గం మాత్రం.. పదేపదే ప్రభుత్వాన్ని కార్నర్ చేసేస్తుంటుంది. ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటుంది. భాజపాలోని మరో వర్గం.. చంద్రబాబుకు భజన చేస్తూ.. ఆయన కార్య సామర్థ్యాలను కీర్తిస్తూ.. కొనసాగుతుంటుంది. మొదటి వర్గం.. పార్టీ వ్యవహారాల్లోనూ - రెండో వర్గం నాయకులు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కీలకంగా కనిపిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించిన నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల పోకడల్లో కూడా మార్పులు అనివార్యంగా వస్తాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. రాష్ట్ర భాజపాలో చంద్రబాబు వ్యతిరేక కూటమికి ప్రాధాన్యం పెరుగుతుందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఫలితాలు వెలువడిన రోజునే.. చిన్న వివాదం కూడా రాజుకుంది. సోము వీర్రాజు వ్యాఖ్యలు.. వాటిని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఖండించడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే.. కాలక్రమంలో చంద్రబాబు వ్యతిరేక నాయకులకు భాజపాలో ప్రాధాన్యం పెరుగుతుందనే ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర భాజపా నాయకుల్లో కేవలం సోము వీర్రాజు మాత్రమే కాదు - దగ్గుబాటి పురందేశ్వరి - కన్నా లక్ష్మీనారాయణ ఇంకా అనేక మంది నాయకులు బాబు వ్యతిరేక స్వరాన్ని తరచూ వినిపిస్తూ ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పటికీ.. బాబు చేస్తున్నది ఏమీలేదని.. సాంతం నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవే అని.. వాటి నిర్వహణలోనూ రాష్ట్ర సర్కారు విఫలం అవుతున్నదని.. వారు వక్కాణిస్తుంటారు. నిజం చెప్పాలంటే.. ఆ వర్గం.. వారికే ఇటీవలి కాలంలో భాజపా అగ్రనాయకత్వం వద్ద కూడా ప్రాధాన్యం పెరుగుతున్నదని గుసగుసలు ఉన్నాయి. వారి చేతుల్లోనే రాష్ట్ర భాజపా సారథ్యం కూడా పెడతారనే వార్తలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పరిణామాలను సమీక్షించుకున్నప్పుడు ఏపీ రాజకీయాల్లో.. భాజపాలో...  ఈ విజయాల పురస్కరించుకుని.. యాంటీ చంద్రబాబు నినాదం జోరందుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News