ఏపీ బీజేపీని వెంటాడుతున్న పాతగాయాలు

Update: 2017-11-08 17:30 GMT
కేంద్ర ప్రభుత్వ శుష్క హామీలపై పోరాటానికి ఏపీలోని ప్రజాసంఘాలు - పార్టీలు - నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కేంద్రం తీరును ఎండగట్టడానికి అస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీతోపాటు - ప్రత్యేక ప్యాకేజీ - విశాఖ రైల్వే జోన్ - ఇతర విభజన హామీలు ఇప్పటివరకూ అమలుచేయకపోవడంతో పాటు ఏడాది కిందటి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం.. ప్రస్తుతం ఇబ్బందిపెడుతున్న జీఎస్టీ నిర్ణయాలతో కేంద్రం ఎంతగా దెబ్బతీసిందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. రాష్ర్టంలో కనిపిస్తున్న ఈ పరిస్థితులు ఏపీ బీజేపీని కలవరపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఎంతోకొంత లబ్ధి పొందుదామని ప్రయత్నిస్తున్న ఆంధ్రబీజేపీ నేతలు సైలెంటుగా తమ కార్యాచరణ రూపొందించుకుంటూ, అమలు చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఇలా పాతగాయాలను కెలికి ప్రజలకు మరోసారి ఆ నొప్పి గుర్తు చేస్తున్న పార్టీలు - నేతలు - సంఘాలను చూసి బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
    
రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ వేటినీ సంపూర్ణంగా అమలుచేయని కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే చెప్పాలి. దీంతో రాజకీయంగా - సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు - ప్రతిపక్షాలకు ఈ అంశం ఆయుధంగా మారుతోంది. ఒకరకంగా ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకీ ఇబ్బందికర పరిణామమే... బీజేపీకి మిత్రపక్షం కావడంతో ఆ ప్రభావం టీడీపీపైనా పడే అవకాశముంది. అయితే.. టీడీపీ తెలివిగా ఆ ప్రభావం తమపై పడకుండా బీజేపీనే ప్రధాన ముద్దాయిగా చూపించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
మరోవైపు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 16న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ తర్వాత 25 మంది ఎంపీలపై ఒత్తిడి చేయడంతోపాటు - ఢిల్లీకి వెళ్లి ప్రధాని ఇంటినీ ముట్టడించాలని తీర్మానించింది. ఈ మేరకు సమితి తాజాగా నిర్వహించిన సమావేశానికి టీడీపీ - బీజేపీ మినహా అన్ని పార్టీల అగ్రనేతలు - ప్రజాసంఘాలు హాజరయి తమ మద్దతు ప్రకటించారు. చలో అసెంబ్లీ అనంతరం కార్యాచరణ రూపొందించుకుని, దానిని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చేర్చేందుకు సిద్ధమవుతోంది. పాత నిర్ణయాలకు తోడు ఇటీవల జీఎస్టీ కూడా కలిసి ప్రజల్లో ఆగ్రహజ్వాల పెరుగుతుండంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వ్యాపారులు - మధ్యతరగతి ప్రజల్లో జీఎస్టీపై విపరీత వ్యతిరేకత వ్యక్తమవుతుండటం రాష్ట్రంలో ఎదగాలనుంటున్న బీజేపీకి ఇబ్బందికరపరిస్థితులు ఎదురవుతున్నాయి.
Tags:    

Similar News