వినాయకచవితితో ఏపీలో బీజేపీ రాజకీయానికి శ్రీకారం?

Update: 2019-08-28 10:13 GMT
హిందుత్వ నినాదాలను - హిందూ పండగలను భారతీయ జనతా పార్టీ తన రాజకీయానికి అనుగుణంగా  వాడుకోవడం కొత్త ఏమీ కాదు. ఆ పార్టీ ఆవిర్భావం దగ్గరే  హిందుత్వ నినాదాలు  గట్టిగా వినిపించాయి.  అయితే అధికారం అందుకోవడానికి చాలా కాలం పట్టింది. దశాబ్దాల తర్వాత  బీజేపీ కేంద్రంలో పాగా వేసి - ఇప్పుడు పూర్తిగా సెటిలైన దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఇదే ఊపులో దేశమంతా విస్తరించాలని కూడా భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. బీజేపీ పాచికలు ఉత్తరాదిన పారాయి - ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పారాయి. కానీ, దక్షిణాదినే పెద్దగా రాణించలేకపోతోంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఏపీలో కూడా బీజేపీ రకరకాలుగా కసరత్తు చేస్తూ ఉంది.

ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న నేతలతో బండిలాగించాలని భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. అవి ఎంత వరకూ సఫలం అవుతాయో కానీ.. బీజేపీ మార్కు ప్రయోగాలను ఏపీలో చేస్తున్నారు నేతలు. అందులో భాగంగా వినాయకచవితిని విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించనుందట భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా ముప్పై అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నెలకొల్పనుందట.  ఏపీ బీజేపీ  విభాగం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఈ వినాయక ఉత్సవ సమితి పని చేయనుందని తెలుస్తోంది.

ఈ  వినాయక విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారు చేయించారట. సహజమైన రంగులనే వాడుతున్నారట.  మరింత సెంటిమెంట్ ఏమిటంటే.. గంగానది మట్టితో ఈ విగ్రహాన్ని తయారు  చేసినట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే రెండు  వేల మట్టి  వినాయక విగ్రహాలను పంచనున్నారట!

ఇదంతా కేవలం పండగ సంబరమే అనుకోవాలా.. లేక ఇలా పండగ ద్వారా రాజకీయాన్ని కూడా పదును పెట్టాలని బీజేపీ అనుకుంటోందా.. అనే అంశం గురించి చర్చ మొదలైంది!


Tags:    

Similar News