ఎప్పుడూ చూడని రీతిలో గౌతమ్అదానీలో కొత్త యాంగిల్

గౌతమ్ శాంతిలాల్ అదానీ అన్నంతనే కాస్తంత కన్ఫ్యూజ్ అవుతాం. కారణం.. అందరికి సుపరిచితమైన పేరు గౌతమ్ అదానీ మాత్రమే.

Update: 2025-02-13 05:30 GMT

గౌతమ్ శాంతిలాల్ అదానీ అన్నంతనే కాస్తంత కన్ఫ్యూజ్ అవుతాం. కారణం.. అందరికి సుపరిచితమైన పేరు గౌతమ్ అదానీ మాత్రమే. అత్యంత వేగంగా తన గ్రూపును పెంచి పెద్దది చేయటమేకాదు.. ప్రపంచ కుబేరుల స్థానంలోనూ చోటు సాధించిన ఆయన జోరు ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీషాలకు అత్యంత సన్నిహితుడన్న పేరున్న గౌతమ్ అదానీలో ఇప్పటివరకు బయటకు రాని ఒక కొత్త యాంగిల్ కొడుకు పెళ్లి సందర్భంగా బయటకు వచ్చింది.

పెళ్లి వేడుకుల వేళ.. ఆయన ఎమోషన్ అయ్యారు. కొడుకు పెళ్లిలో ప్రసంగించిన ఆయన.. తన కొడుకు జీత్ అదానీ.. ఆయన తల్లి ప్రీతి అదానీ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మాట్లాడి గుండెల్ని టచ్ చేశారని చెప్పాలి. తన కొడుకు పెళ్లిని విలాసవంతంగా కాకుండా.. నార్మల్ గా నిర్వహించారు. ఈ విషయాన్ని ముందే తెలియజేశారు కూడా. తన కొడుకు జీత్.. కోడలు దివాలను ఉద్దేశించి మాట్లాడిన గౌతమ్ అదానీ.. ‘‘మీరిద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇవి మాకు కేవలం ఆనంద క్షణాలు మాత్రమే కాదు. ఎంతోమంది పేదల జీవితాలను మార్చేకార్యక్రమాలకు నాంది పలుకుతుంది. వీరిద్దరూ జీవితాంతం దాత్రత్వం.. బాధ్యతలను పంచుకుంటూ గడపాలి’’ అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

తన ప్రసంగంలో బాగంగా తన సతీమణి ప్రీతి అదానీ గురించి మాట్లాడటమేకాదు.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఒక మహిళ బిడ్డకు జన్మను ఇవ్వటమే కాదు.. తన చిన్నారి కలల కోసం ఏకంగా ఆమె జీవితాన్ని అంకితం చేస్తుందనటంలో సందేహం లేదు. జీత్ అదానీ వెనకున్న నిజమైన శక్తి.. అతడి తల్లి ప్రీతి అదానీ. ఆమె ప్రేమే.. అతడ్ని మార్గనిర్దేశం చేస్తూ ముందుకు నడిపించిందన్నారు.

ఈ సందర్భంగా కొడుకు జీత్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నావు. మీరు వేసిన ప్రతీ అడుగు ఆమె పంచిన ప్రేమ.. త్యాగాల ఫలితమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకో. ఆమె మీకు బలం. క్లిష్ట పరిస్థితుల్లోనూ అమ్మ మీ వెంటే ఉంటుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అదానీ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వినపడవని చెబుతున్నారు. గుజరాత్ కుచెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివాతో.. జీత్ అదానీ వివాహం ఈ నెల ఏడున జరగటం తెలిసిందే.

వీరి వివాహ వేడుక సందర్భంగా ప్రతి ఏడాది 500 మంది దివ్యాంగ సోదరీమణుల పెళ్లిళ్ల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు.. వారి కుటుంబాలు ఆనందంతో.. గౌరవంతో ముందుకు సాగుతాయన్న ఆలోచనే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. తన ప్రసంగంలో గౌతమ్ అదానీ ప్రస్తావించిన ఆయన సతీమణి ప్రీతి అదానీ విషయానికి వస్తే.. అత్యంత సంపన్నురాలు అయినప్పటికి సాదాసీదాగా ఉండటం ఆమె ప్రత్యేకతగా చెబుతారు.

గౌతమ్ అదానీ భార్యగా తెలిసినప్పటికీ.. ఆమె ఒక డెంటిస్ట్. సంపన్న వ్యాపారవేత్త సతీమణిగా ఎక్కువఫోకస్ అయినప్పటికి ఆమెను విద్యావేత్తగా పలువురు అభివర్ణిస్తారు. అదానీ గ్రూపు నిర్వహించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఆమె చీరలు.. సల్వార్ సూట్స్ ధరిస్తుంటారు. సాదా రంగు కాటన్ చీరల్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. లైట్ కలర్ సల్వార్ కమీజ్ సూట్ లో కనిపిస్తూ ఉంటారు. 1986లో గౌతమ్ అదానీతో ఆమెకు వివాహమైంది. 1996లో ఆమె ఒక ఎన్జీవోను ప్రారంభించారు. దీని ద్వారా పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య కనిపించని అంతరాన్ని తగ్గించటంగా చెబుతారు. ఈ సంస్థ అనేక రంగాల్లో పని చేస్తోంది. దేశంలోని 18 రాష్ట్రాల్లోని 5753 కంటే ఎక్కువ గ్రామాల్లో పని చేస్తూ ప్రజలకు సేవలు చేస్తుందని చెబుతారు.

Tags:    

Similar News