పిల్లి చేసిన లొల్లితో హైదరాబాద్ లో అక్కడ ఆగమాగం
హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర లోని సంకట విమోచన హనుమాన్ ఆలయంలో బుధవారం ఉదయం 8 గంటల వేళలో శివాలం వద్ద మాంసం ముక్క పడి ఉండటాన్ని గుర్తించారు.
ఒక పిల్లి చేసిన పని.. పె..ద్ద పంచాయితీనే నడిచింది. ఇందుకు హైదరాబాద్ లోని పాతబస్తీ వేదికగా మారింది. లక్కీగా అక్కడ సీసీ కెమేరాలు ఉండటం.. అవి సరిగా పని చేయటంతో పిల్లి చేసిన ఘనకార్యాన్ని గుర్తించిన పోలీసులతో.. అప్పటివరకు నడిచిన ఉద్రిక్తత సడలిపోయింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర లోని సంకట విమోచన హనుమాన్ ఆలయంలో బుధవారం ఉదయం 8 గంటల వేళలో శివాలం వద్ద మాంసం ముక్క పడి ఉండటాన్ని గుర్తించారు.
ఇదెలా వచ్చిందన్న చర్చ అక్కడ అలజడి రేగింది. ఇతర వర్గాలకు చెందిన వారు చేసిన పనేనని.. ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ అంశంపై కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులతో పాటు.. ఇష్యూలో ఉన్న సెన్సిటివిటీ కారణంగా పోలీసు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు.
ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించేందుకు ప్రత్యేకంగా నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. వాటిని జల్లెడ వేసే క్రమంలో ఒక రెండు కెమేరాల్లో పిల్లి ఒకటి నోట్లో పట్టుకొచ్చిన మాంసం ముక్కను ఆలయంలో వదిలి వెళ్లిన వైనాన్ని గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ను విడుదల చేయటంతో పాటు.. అసలేం జరిగిందన్న వివరణను ఇవ్వటంతో అక్కడ ఉద్రికత్త సడలింది. మొత్తానికి పిల్లి పెట్టిన పంచాయితీకి సీసీ కెమేరాలు ఉండటంతో ఇష్యూ క్లోజ్ అయ్యింది కానీ లేకుంటే మరెంత రచ్చ జరిగేదో?అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.