ఒకరికి పండుగ.. మరొకరికి వేదన

Update: 2016-06-02 08:07 GMT
తెలంగాణ రాష్ట్ర విభజన కోసం చేసిన ఉద్యమం సమయంలో చాలామంది టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎటకారం చేశారు కానీ.. ఈ రోజు ఆయన మాటలు ఎంత నిజమన్నది అర్థమయ్యే పరిస్థితి. అందరూ తెలుగువాళ్లే. కానీ.. ఒకరేమో పండుగ చేసుకుంటుంటే.. మరొకరు వేదనలో మునిగిపోయిన పరిస్థితి. బ్యాలెన్స్ గా మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని ఉంచాలనుకొని ప్రయత్నించే చంద్రబాబు నోటి నుంచి కూడా ‘‘మనది పూలబాట కాదు.. విభజన సమయంలో కట్టుబట్టలతో పంపేశారు. అప్పులు మోసుకొని వచ్చాం’’ అని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి.

తప్పులు ఎవరు చేసినా కానీ.. ఒక ఉమ్మడి కుటుంబం విడిపోయేటప్పుడు చిన్న చిన్న చికాకులు తప్పనిసరి. కానీ.. ఆ విడిపోవటం అన్నది వారి మధ్య దగ్గర కాలేనంత దూరాన్ని పెంచకూడదు. విడిపోయామన్న బాధ ఉన్నా.. ఫర్లేదు అంతా సంతోషంగా ఉన్నాం కదా? ఎవరి బతుకులు వారు బతుకుతున్నాం కదా? కష్టం వస్తే మనం అండగా ఉందాం. ఎవరి స్పేస్ వారికి ఇవ్వాలి కదా? అన్నట్లుగా ఉండాలే కానీ.. విభజన అన్నది ఒకరికి వరంగా.. మరొకరికి శాపంగా మారకూడదు.

విభజన సమయంలో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చేసిన విభజన తీరు ఈ రోజు దుస్థితికి కారణంగా చెప్పక తప్పదు. విభజన సమయంలోనే రెండు పక్షాల వారిని కూర్చోబెట్టి.. ఉభయులకు అంగీకారమైన విధంగా విభజన చేసి ఉంటే ఈ రోజు చాలానే పంచాయితీలు ఉండేవి కావు. కాస్త ఎక్కువ తక్కువ చికాకులు ఉన్నప్పటికీ.. విభజన తర్వాత అవన్నీ సమిసిపోయేవి. కానీ.. ఏకపక్షంగా.. తాను ఏం అనుకుంటే అదే రూల్ అన్నట్లుగా సోనియమ్మ చేసిన విభజనతో సీమాంధ్రు దారుణంగా నష్టపోయిన పరిస్థితి.

మరోవైపు.. దశాబ్దాల తమ కల తీరిన సంతోషంలో ఉన్న తెలంగావాదులు.. సీమాంధ్రుల బాధను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఉండాలని అనుకోవటం కూడా సమంజసం కాదు. ఎందుకంటే వారిది వేదనాభరితమైన వ్యవహారమే. దశాబ్దాల తరబడి తమ కలను రాజకీయ వస్తువుగా చేసుకొని బంతాట ఆడుకున్న రాజకీయాల్ని తమ పోరుబాటతో తమ దారికి తెచ్చుకున్న సంతోషంలో ఉన్నప్పుడు.. మరొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

విభజన తేడాలు రెండేళ్లు గడిచిన తర్వాత కూడా సమిసిపోని పరిస్థితి. కనుచూపు మేరలో రెండు సమం అయ్యే ఛాన్స్ లేదు. మరి.. ఇలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న సీనే ప్రతి ఏడాది కనిపించే దుస్థితి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకరు పండుగ చేసుకుంటూ ఉంటే.. మరొకరు మాత్రం అందుకు భిన్నంగా వేదనాభరితమైన భావనలో కుంగిపోవటం కనిపిస్తుంది. ఒకే జాతిలో ఈ రెండు వైరుధ్యాలు ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు పండుగ చేసుకుంటే.. మరొకరు విషాదంలో మునిగిపోవటం ‘తెలుగు’ కుటుంబానికి మంచిది కాదు. కానీ.. ఈ బాధను తగ్గించాలన్న ఆలోచన తెలుగు జాతి పెద్దలకు లేకపోవటమే అసలుసిసలు విషాదం.
Tags:    

Similar News