ఏపీ దుస్థితి; ఒక చేత్తో అప్పు.. మరోచేత్తో ఖర్చు

Update: 2015-07-29 04:43 GMT
ధనిక రాష్ట్రమన్న ధీమా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తుంటే.. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. డబ్బుల్లేక బొక్కసం ఖాళీ అయ్యిందన్న విషయం తెలిసినప్పటికీ.. ఇన్నేసి ఖర్చుల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారన్నది కాస్త అర్థం కానిదిగా ఉంటుంది. ఆయన పెట్టే ఖర్చులు చూసినప్పుడు మైండ్ బ్లాక్ కాక తప్పదు.

గోదావరి మహా పుష్కరాల ఖర్చునే చూస్తే.. తెలంగాణలోని 5 జిల్లాల్లో పుష్కరాలు నిర్వహించి.. ఏర్పాట్లు చేసేందుకు రూ.600 కోట్ల కంటే తక్కువే ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. ఏపీ సర్కారు మాత్రం రెండు జిల్లాల్లో నిర్వహించిన గోదావరి పుష్కరాల కోసం ఏకంగా రూ.1500 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారు. మరి.. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టిన ఏపీకి.. ఆచితూచి ఖర్చు చేసిన తెలంగాణకు మధ్య ఏర్పాట్లు అందరూ చూసిందే. మరింత భారీగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు అండ్ కో.. నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారన్న విషయంపై దృష్టి సారిస్తే.. గుండెలు అవిసిపోవటం ఖాయం.

భారీగా ఖర్చు చేస్తూ ఉండే చంద్రబాబు సర్కారు.. అందుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు అప్పుల మీద అప్పులు చేస్తూ ఉండటం కనిపిస్తుంది. మిగిలిన నెలల్ని వదిలేసి ఒక్క జులై విషయానికి వస్తే.. ఈ నెల 14 తేదీన బాండ్ల అమ్మకం ద్వారా రూ.1300కోట్లను సేకరించింది. బాండ్లను అమ్మి రూ.1300కోట్లు రుణం తీసుకుంది. కేవలం రెండు వారాలు గడిచేసరికి.. చేతికి వచ్చిన రూ.1300కోట్లు ఖర్చు అయిపోయాయి.

మరోసారి.. బాండ్లను అమ్మటం ద్వారా తాజాగా మరో రూ.వెయ్యి కోట్లను సేకరించింది. ఇందుకోసం సాలీనా 8.31 శాతం వడ్డీకి అప్పు తీసుకొచ్చింది. ఒకవైపు భారీ వడ్డీకి తీసుకొస్తూ.. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్న తీరు చూస్తే విస్మయం కలగక మానదు. ఈ నెల రెండో వారంలో సేకరించిన రూ.1300కోట్లలో ఎక్కువ భాగం వేతన సవరణ కోసం.. గోదావరి పుష్కరాల కోసం ఖర్చు చేయటం కనిపిస్తోంది. ఒకచేత్తో అప్పు మీద అప్పు తీసుకొస్తూ.. మరోవైపు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్న ధోరణి ఏపీ సర్కారులో కనిపిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ఇలా వరుసగా చేసే అప్పులతో ఏపీ బండిని ఎంతకాలం నడిపిస్తారో..?
Tags:    

Similar News