కోదండరాంలను మొగ్గలోనే తుంచేస్తున్నారంట

Update: 2015-09-25 04:22 GMT
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా ఉంటూ రాజకీయాల్ని నడిపించటం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసే కోదండరాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి భూమిక పోషించారో అందరికి తెలిసిందే.

అంత పెద్ద ఉద్యమం చేసిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి కూడా నాటి ఉమ్మడి ఏపీ సర్కారు వణికిపోయింది. కోదండరాం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా లేనిపోని సమస్యలకు కారణం అవుతుందన్న తీరుతో.. ఆయన విషయంలో ఏమీ జరగనట్లు వ్యవహరించేది. చివరకు.. ఆయన రాజకీయ పార్టీలను సైతం శాసించే పరిస్థితికి చేరుకోవటం.. శాసించటం జరిగింది.

ఇలాంటివి ఏపీలో జరగకూడదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఏపీ సర్కారు తీరు చూస్తుంటే. ఏపీకి ప్రత్యేక హాదా కోసం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో వైజాగ్ లో ఈ నెల 22న యువభేరీ సదస్సు జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరును నిశితంగా విమర్శించటం.. తమ మాటలతో సెగ పుట్టించిన ఆరుగురు ప్రొఫెసర్ల విషయంలో ఏపీ సర్కారు గుర్రుగా ఉందని చెబుతున్నారు.

యువభేరీలో పాల్గొని వారు చేసిన ఉపన్యాసాల్ని పరిశీలించాలంటూ ఏపీ సర్కారు ఆదేశించిందన్న మాట వినిపిస్తోంది. ఇందుకోసం అంతర్గత విచారణ ఒకటి చేపట్టినట్లుగా తెలుస్తోంది. యువభేరీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవటం.. వారిపై వేటు వేసేందుకు ఏపీ సర్కారు సన్నద్ధంగా ఉందంటున్నారు. క్రమశిక్షణ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న అనుభవం గతం నేర్పిన నేపథ్యంలో.. ఇలాంటి పరిణామాలపై కఠినంగా ఉండాలని బాబు సర్కారు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  విశ్వసనీయ సమాచారంప్రకారం యువభేరీలో పాల్గొన్న వర్సిటీ మాజీ రిజిష్ట్రార్.. ప్రస్తుతం కంప్యూటర్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పీవీజీడీ ప్రసాద్ తోపాటు.. మరో ఐదుగురు ప్రొఫెసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News