జగన్ దీక్షకు అనుమతి ఇస్తే...?

Update: 2015-09-24 17:30 GMT
వైసీపీ అధినేత జగన్ దీక్షకు అనుమతి ఇస్తే ఏమవుతుంది? జగన్ ఇప్పటి వరకూ ఎన్నో దీక్షలు చేశారు. వాటిలో ఇది కూడా ఒకటి అవుతుంది. వాస్తవానికి, వైసీపీ నేతలు మినహా మిగిలిన ప్రజలు ఆయన దీక్ష గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, ఇప్పుడు జగన్ దీక్షను అడ్డుకోవడం ద్వారా జగన్ కు ఎక్కువ ప్రచారం కల్పించినట్లయింది. ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందనే భావన ప్రజల్లో కలగడానికి కారణమవుతోంది.

వాస్తవానికి బీహార్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేవలం బీహార్ ఎన్నికల కోసమే నిర్ణయాన్ని వాయిదా వేస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో నవ్యాంధ్రలో ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంటుగా మారడమే కాకుండా అధికార బీజేపీపైనే వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్రానికి అనేక నివేదికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ఏమవుతుందనే కోణంలోనూ కేంద్రంలో చర్చ జరుగుతోందని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ప్యాకేజీ విషయంలో కూడా కాస్త మంచిగానే కేంద్రం ఆలోచిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో జగన్ దీక్షకు అనుమతి ఇస్తే ప్రత్యేక హోదా, ప్యాకేజీ తెచ్చిన ఘనత తమదేనని, జగన్ దీక్ష చేయడంతోనే హోదా, ప్యాకేజీ వచ్చాయని వైసీపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని అధికార టీడీపీ భావిస్తోంది. దానికితోడు గుంటూరు రాజధాని నగరం కావడం.. ఇక్కడ దీక్ష చేస్తే దాని ప్రభావం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే, జగన్ దీక్ష కారణంగానే నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, ప్యాకేజీ వచ్చాయంటే ఎవరూ నమ్మేది లేదని, ఆయనపై ప్రస్తుతం ప్రజల్లోనూ అంత సానుకూల భావన లేదని, ఈ నేపథ్యంలో ఆయన దీక్ష చేసినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, జగన్ దీక్షను కొనసాగించడమే మేలనే భావన కొంతమంది టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అనవసరంగా అడ్డుకుని జగన్కు ప్రచారం కల్పించినట్లు అవుతోందని వివరిస్తున్నాయి.
Tags:    

Similar News