సాయంత్రం 6 గంట‌ల‌కు మందు దుకాణాలు బంద్‌!

Update: 2019-07-09 06:11 GMT
వ‌చ్చే ఆదాయాన్ని వ‌ద్దుకునే ప్ర‌భుత్వాలు ఎక్క‌డైనా చూశామా?  కాసులు కురిపించే శాఖ‌ల్ని బంద్ పెట్టే స‌ర్కారు గురించి ఎక్క‌డైనా విన్నామా?  ఆదాయం కంటే రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం ముఖ్య‌మ‌ని భావించే ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చెప్పాలి. ఇవాల్టి రోజున ఏ రాష్ట్రానికైనా ప్ర‌ధాన ఆదాయ‌వ‌న‌రుగా ఉన్న‌వి ఏమైనా ఉన్నాయంటే అందులో మొద‌టిది పెట్రోల్.. డీజిల్ మీద వ‌చ్చే ఆదాయమైతే.. రెండోది ఎక్సైజ్ మీద ద్వారా వ‌చ్చే కాసులే.

ఎన్నిక‌ల‌కు ముందు తానిచ్చిన పాక్షిక మ‌ద్య‌నిషేధంపై దృష్టి సారించారు జ‌గ‌న్‌. పేద‌ల ర‌క్తాన్నిపీల్చేస్తూ.. వారిని మ‌ద్యానికి బానిస‌లుగా మార్చేస్తున్న వైనానికి చెక్ పెట్టే దిశ‌గా ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది.

మ‌ద్యం వినియోగాన్ని వీలైనంత‌వ‌ర‌కూ త‌గ్గించే దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముఖ్య‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా మ‌ద్యం అమ్మ‌కాలు ఎక్కువ‌గా ఉండే సాయంత్రం నుంచి రాత్రి స‌మ‌యాల్లో మ‌ద్యం దుకాణాల్ని బంద్ చేయించాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉద‌యం 10 గంట‌ల‌కు మొద‌ల‌య్యే మ‌ద్యం అమ్మ‌కాలు రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంటాయి.  రోజు మొత్తం సాగే అమ్మ‌కాల్లో అత్య‌ధికం సాయంత్రం ఐదు గంట‌లు మొద‌లై.. రాత్రి 10 గంట‌ల‌వ‌ర‌కూ ఎక్కువ‌గా ఉంటాయి. షాపులు బంద్ చేయ‌కుండా ఉండాలే కానీ.. రాత్రి12 గంట‌ల వ‌ర‌కూ జ‌నాల ర‌ద్దీ ఉంటూనే ఉంటుంది.

ఉద‌యం ప‌నుల‌కు వెళ్లే కూలీలు మొద‌లు ఉద్యోగుల వ‌ర‌కూ సాయంత్రం ఇంటికి వ‌చ్చే ముందు చుక్కేసేందుకు ప్రాధాన్య‌త ఇస్తారు. రాత్రి పార్టీల్లో అత్య‌ధికం మందుపార్టీలే అన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ద్యం అమ్మ‌కాలు ఎక్కువ‌గా ఉండే సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య మ‌ద్యం దుకాణాల్ని మూసివేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది.

ఇప్ప‌టికే ఈ అంశం మీద అధికారులు స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ‌.. అధికారులు చెప్పిన‌ట్లే సాయంత్రం ఆరు నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య‌లో మ‌ద్యం అమ్మ‌కాల‌పై బ్యాన్ విధిస్తే.. అక్ర‌మంగా మ‌ద్యాన్ని అమ్మే అవ‌కాశం ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇలాంటి ప‌రిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు నిఘా విభాగాన్ని మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని భావిస్తున్నారు. మ‌ద్యం దుకాణాల్ని సాయంత్రం ఆరు గంట‌ల‌కే బంద్ అయ్యేలా జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంటే.. మందు బాబుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌టం ఖాయం. ఒక‌వేళ‌.. ఈ నిర్ణ‌యాన్ని  అమ‌లు చేస్తే మాత్రం జ‌గ‌న్ స‌ర్కారు ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News