ఆ రెండు బిల్లులు పాసైతేనే రాజధాని తరలింపు!

Update: 2020-04-24 15:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ను తరలించేందుకు ప్రయత్నిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌ పై ఈ రోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లు ఆమోదం కాకుండా తరలింపు ప్రక్రియను చేపట్టబోమని హైకోర్టుకు ఏజీ చెప్పారు. ఇదే అంశంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఇందుకోసం 10 రోజుల సమయాన్ని కూడా ధర్మాసనం ఇచ్చింది. ఈ లోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్న ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. రాజధాని తరలింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ కోర్టులో ప్రస్తావించారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఏజీకి హైకోర్టు సూచించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఆర్‌ ఫైవ్ జోన్ ఏర్పాటుపై అభ్యంతరాలకు గడువు పూర్తి కాకుండానే లే అవుట్లు వేయడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన ఈ  పిటీషన్ పై విచారణ జరిగింది.

ఆ జోన్‌పై అభ్యంతరాలు స్వీకరించేందుకు గడువు పూర్తికాకుండా నేలపాడులో లే అవుట్‌ ను అభివృద్ధి చేయడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కూడా 10 రోజుల లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీంతో, ఈ రెండు పిటిషన్ల తదుపరి విచారణ 10 రోజుల తర్వాత జరగనుంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వికేంద్రీకరణ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందకుండా రాజధాని తరలింపు సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందగా....మండలిలో పెండిగ్ లో ఉన్నాయి. ఈ బిల్లులపై గందరగోళం జరగడంతో...వీటిని సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. అయితే, సెలక్ట్ కమిటీకి మండలి చైర్మన్ షరీఫ్ రిఫర్ చేయడం రూల్స్ కు విరుద్ధమంటూ...విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత శాసనమండలి రద్దుకు ప్రభుత్వం బిల్లు పాస్ చేసింది. అయితే, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా విపత్తు...లాక్ డౌన్ వల్ల పాలనాపరమైన వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం...ఆ రెండు బిల్లులు పాసయ్యే వరకు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపు సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News