ఈసీకి హైకోర్టు ఆదేశాలు - చిక్కుల్లో బాల‌య్య‌!

Update: 2019-01-26 05:26 GMT
హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను నంద్యాల ఉప ఎన్నిక వెంటాడుతోంది. నాటి ఎన్నిక‌ల్లో బాలయ్య ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచారంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తాజాగా స్పందించింది. ఈ వ్య‌వ‌హారంలో పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది. డ‌బ్బుల పంపిణీపై ప‌క్కా ఆధారాలున్నాయ‌ని పిటిష‌న్ దారుడు చెబుతున్న నేప‌థ్యంలో బాల‌య్య చిక్కుల్లో ప‌డ్డ‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2017లో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగింది. నాటి ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బాల‌కృష్ణ‌ ప్ర‌చారంలో పాల్గొన్నారు. నంద్యాల‌లో భారీ రోడ్ షో నిర్వ‌హించారు. ఆ రోజు బాల‌య్య ఓట‌ర్ల‌కు బ‌హిరంగంగా డ‌బ్బులు పంచార‌ని కె.శివకుమార్ అనే వ్య‌క్తి ఆరోపించారు. బాల‌కృష్ణ చ‌ర్య ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మేన‌ని తెలిపారు. ఆయ‌న డ‌బ్బులు పంచుతున్నార‌ని నిరూపించేందుకు ప‌క్కా ఆధారాలున్నాయ‌ని తెలిపారు. వాటిని స‌మ‌ర్పించినా కూడా అధికారులు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో అధికారులే కేసు న‌మోదు చేయాల‌ని నిబంధ‌న‌లు చెప్తున్న సంగ‌తిని గుర్తుచేశారు. కాబ‌ట్టి బాల‌య్య‌పై కేసు న‌మోదు చేసేలా ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను ఆదేశించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

శివ‌కుమార్ పిటిష‌న్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్ - న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ వ్య‌వ‌హారంలో పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మూడు వారాల‌కు వాయిదా వేసింది. తాజా ప‌రిణామాల‌తో బాల‌కృష్ణ చిక్కుల్లో ప‌డ్డ‌ట్లేన‌ని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి ఈ కేసు నుంచి బాల‌య్య బ‌య‌ట‌ప‌డ‌తారా? లేక శిక్ష త‌ప్ప‌దా? అనే సంగ‌తి తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News